రెపో రేటు యథాతథం.. ఆర్బీఐ మోనిటరీ పాలసీ కమిటీ కీలక నిర్ణయం

  • వరుసగా ఆరవసారి 6.5 శాతంగా కొనసాగించాలని నిర్ణయించిన ఆర్బీఐ ఎంపీసీ కమిటీ
  • ఆర్థిక వృద్ధికి ఊతం, ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యమని వెల్లడి
  • వడ్డీ రేట్ల విషయంలో సర్దుబాటు వైఖరిని కొనసాగిస్తామన్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్
అత్యంత కీలకమైన రెపో రేటును వరుసగా ఆరవసారి 6.5 శాతంగా యథాతథంగా కొనసాగిస్తూ కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ నిర్ణయించింది. అయితే పరిస్థితుల ఆధారంగా సర్దుబాటు వైఖరిని కొనసాగించాలని భావించింది. ఈ మేరకు ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షలో ఆర్బీఐ మోనిటరీ కమిటీ సభ్యులు నిర్ణయించారు. రెపో రేటును యథాతథంగా కొనసాగింపునకు అనుకూలంగా ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు అనుకూలంగా ఓటు వేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమివ్వడంతో పాటు ద్రవ్యోల్బణం నియంత్రణకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. 2024-25కు సంబంధించిన మధ్యంతర బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్బీఐ నిర్వహించిన తొలి సమావేశం కావడం గమనార్హం. కాగా మే 2022 నుంచి గతేడాది ఏప్రిల్ మధ్యకాలంలో రెపో రేటు ఏకంగా 250 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది. అయితే ఆ తర్వాత రెపో రేటులో ఎలాంటి మార్పులేదు.

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసి ఆర్థిక వ్యవస్థ పురోగతికి బాటలు వేయడమే ఆర్బీఐ లక్ష్యమని శక్తికాంత దాస్ అన్నారు. ఆహార పదార్థాల ధరల కారణంగా ద్రవ్యోల్బణం పరిస్థితులు నెలకొంటున్నాయని, పంపిణీ వ్యవస్థపై ఈ ప్రభావం పడుతోందని ఆయన చెప్పారు. భౌగోళిక రాజకీయ పరిస్థితులు, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో అస్థిరత ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది సాధారణ వర్షపాతం నమోదైతే ఆర్థిక సంవత్సరం 2024-25లో వినియోగదారుల ఆధారిత ద్రవ్యోల్బణం 4.5 శాతానికి తగ్గే అవకాశం ఉందని ఆర్బీఐ అంచనా వేసింది. ద్రవ్యోల్బణం పరిధి  లక్ష్యానికి అనుగుణంగా వడ్డీ రేట్లను సర్దుబాటు చేయనున్నామని పేర్కొన్నారు.


More Telugu News