లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయమని చెబుతున్నారు కానీ ఆసక్తి లేదు: ఎమ్మెల్యే రాజాసింగ్

  • జహీరాబాద్ నుంచి పోటీ చేయమని పార్టీ చెబుతోంది కానీ ఆసక్తి లేదన్న రాజాసింగ్
  • బండి సంజయ్ కోసం కరీంనగర్‌లో ప్రచారం చేస్తానని వెల్లడి
  • కిషన్ రెడ్డి పిలిస్తే సికింద్రాబాద్‌లో కూడా ప్రచారం చేస్తానన్న రాజాసింగ్
  • హిందూ రాజ్య స్థాపన కోసం దేశవ్యాప్తంగా పని చేయాలని ఉందన్న ఎమ్మెల్యే
  • శాసన సభా పక్ష నేత పదవిపై ఆసక్తి లేదని స్పష్టీకరణ
తనను జహీరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయమని పార్టీ చెబుతోందని... కానీ తనకు ఆసక్తిలేదని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. 17 లోక్ సభ స్థానాలకూ బీజేపీ బలమైన అభ్యర్థులను బరిలోకి దించే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా జహీరాబాద్ నుంచి రాజాసింగ్ పేరు ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గోషామహల్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ నేపథ్యంలో ఆయన జహీరాబాద్ లోక్ సభ నుంచి పోటీ అంశంపై స్పందించారు. పార్టీ పోటీ చేయమని చెబుతోందని... కానీ ఆసక్తి లేదని అన్నారు. కరీంనగర్ లోక్ సభ పరిధిలో బండి సంజయ్ కోసం తాను ప్రచారం చేస్తానన్నారు. కిషన్ రెడ్డి పిలిస్తే సికింద్రాబాద్‌లో కూడా ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమన్నారు.

తాను హిందూరాజ్య స్థాపన కోసం దేశవ్యాప్తంగా పని చేయాలని భావిస్తున్నానన్నారు. తనకు శాసన సభా పక్ష నేత పదవిపై ఎలాంటి ఆసక్తి లేదన్నారు. పార్టీ నుంచి గెలిచిన ఎనిమిది మందిలో ఎవరినో ఒకరిని ఫ్లోర్ లీడర్‌గా చేస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఫ్లోర్ లీడర్ ప్రకటన ఆలస్యం మంచిది కాదన్నారు. బీసీ సీఎం నినాదంతో ఎన్నికలకు వెళ్ళాం కాబట్టి.. బీసీ ఎమ్మెల్యేను ఫ్లోర్ లీడర్‌గా నియమించాలని బీజేపీ జాతీయ నాయకత్వం అనుకుంటున్నట్లుగా చెప్పారు.


More Telugu News