మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ

  • ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు మన్మోహన్ సింగ్ చక్రాల కుర్చీలో వచ్చి పని చేశారని కితాబు
  • ఎంపీలందరికీ మన్మోహన్ సింగ్ ఆదర్శంగా నిలిచారన్న మోదీ
  • సుదీర్ఘకాలం ఆయన అందించిన సహకారం, దేశాన్ని నడిపించిన తీరు ఎప్పటికీ గుర్తుంటుందని వ్యాఖ్య
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. రాజ్యసభలో త్వరలో 56 మంది ఎంపీలు పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ... ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు మన్మోహన్ చక్రాల కుర్చీలో ఉన్నప్పటికీ పని చేశారని కితాబునిచ్చారు. ఎంపీలందరికీ ఆయన ఆదర్శంగా నిలిచారన్నారు. మన దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలు మరువలేనివి అన్నారు. సుదీర్ఘకాలం పాటు ఆయన అందించిన సహకారం, దేశాన్ని నడిపించిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు.

రాజ్యసభలో ఇటీవల ఓ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో ట్రెజరీ బెంచ్ గెలుస్తుందని తెలిసినప్పటికీ ఆయన వీల్ చైర్‌లో వచ్చిమరీ ఓటు వేశారని గుర్తు చేశారు. కమిటీ ఎన్నికలు ఉన్న ప్రతిసారి వచ్చి ఓటు వేస్తున్నారని తెలిపారు. ఆయన వచ్చి ఎవరికి ఓటు వేస్తున్నారు... అనే విషయం తాను పట్టించుకోనని... కానీ వచ్చి ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారన్నారు. ఓ సభ్యుడిగా తన విధుల విషయంలో చాలా బాధ్యతగా వ్యవహరిస్తారని... ఇందుకు ఇది నిదర్శనమన్నారు.


More Telugu News