యాత్ర-2 సినిమా విడుదలవుతోందని జగన్ అసెంబ్లీని వాయిదా వేయించారు: అచ్చెన్నాయుడు

  • ముగిసిన ఏపీ చివరి అసెంబ్లీ సమావేశాలు
  • సినిమా కోసం సభను వాయిదా వేయించారంటూ టీడీపీ ఎమ్మెల్యేల ఆగ్రహం
  • పలు జీవోల ప్రతులు దహనం చేసిన వైనం
చివరి అసెంబ్లీ సమావేశాలను, బడ్జెట్ తతంగాన్ని వైసీపీ ప్రభుత్వం అపహాస్యం చేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. నేడు యాత్ర-2 సినిమా విడుదల అవుతోందని చెప్పి జగన్ రెడ్డి కోరిక మేరకు స్పీకర్ సభను వాయిదా వేశారని ఆరోపించారు.  

శాసనసభ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారని, కానీ 9.15 గంటల వరకు సభలో కోరం లేకపోవడంతో సభను వాయిదా వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి 11 గంటల వరకు సభను సమావేశపరచలేదని వెల్లడించారు. అందుకే టీడీపీ శాసనసభా పక్షం ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసిందని, సభ్యులందరం బయటికి వచ్చేశామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. 

ముఖ్యమంత్రికి, వైసీపీ సభ్యులకు సినిమాలే ముఖ్యమయ్యాయి: డోలా బాలవీరాంజనేయస్వామి 

తెలుగు మహిళల్ని కించపరిచి, వారి ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని రోడ్డున పడేసిన ఈ శాసనసభ కార్యకలాపాలు నేటితో ముగిశాయి. సభలోని సభ్యులపై చరిత్రలో మొదటి సారి భౌతిక దాడులు జరిగింది ఈ సభలోనే. స్పీకర్ కు మైక్ ఇవ్వకుండా, సభానిర్వహణకు స్పీకర్ కు అధికారం లేకుండా చేసింది ఈ సభలోనే. చివరకు కోరం లేక ఆలస్యంగా సభ ప్రారంభమైంది కూడా ఇక్కడే. 

సభకు రాకుండా వైసీపీ సభ్యులు సినిమాలకు వెళ్లడాన్ని ఏమనాలి? ప్రజల బాధలు, రాష్ట్ర సమస్యల కంటే ఈ ముఖ్యమంత్రికి, వైసీపీ సభ్యులకు సినిమాలే ముఖ్యమయ్యాయి. ఇంతకంటే దారుణం ఉంటుందా? ఇలాంటి నీతిమాలిన, ప్రజా వ్యతిరేక చర్యలకు, ఘటనలకు సాక్షిగా నిలిచిన ఈ సభకు స్వస్తి చెబుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాం... అని బాల వీరాంజనేయస్వామి తెలిపారు

జగన్ సర్కార్ తీసుకొచ్చిన చీకటి జీవోల ప్రతుల్ని దహనం చేశాం: నిమ్మల రామానాయుడు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు ప్రజాస్వామ్య చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ, విభజనానంతర రాష్ట్రంలోకానీ శాసనసభ జరిగిన తీరు ఒకెత్తు అయితే, 4 ఏళ్ల 10 నెలల జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనలో జరిగింది ఒక ఎత్తు. 

జగన్ రెడ్డి పాలనలో శాసనసభ నిర్వహించిన రోజులన్నీ బ్లాక్ డేస్ అనే చెప్పాలి. నిండు సభ సాక్షిగా వైసీపీ సభ్యులతో, ప్రతిపక్షసభ్యులపై దాడులు చేయించింది ఈ సభలోనే. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు బూతులతో ప్రతిపక్ష సభ్యులపై విరుచుకుపడింది ఈ సభలోనే.

ప్రజాస్వామ్యంలో అధికారపక్షానికి, ప్రతి పక్షానికి సమాన అవకాశం ఇవ్వాల్సిన తరుణంలో ప్రతిపక్షసభ్యులు నోరెత్త కుండా వారి గొంతులు నొక్కేసింది ఈ సభలోనే. మహిళల ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని కించపరిచేలా జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ శాసనసభను కౌరవసభగా మార్చింది. 

ఇలాంటి అనేక దుశ్చర్యలకు, ప్రజాస్వామ్య హనన చర్యలకు వేదికగా నిలిచిన ఈ సభలో చేసిన అనేక ప్రజా వ్యతిరేక చట్టాలకు సంబంధించిన జీవోలను ఇవాళ తగలబెట్టాం... 

జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనలో కౌరవసభగా మారిన శాసనసభ... తిరిగి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల నాయకత్వంలో గౌరవసభగా మారాకే తిరిగి టీడీపీసభ్యులందరం సభలో అడుగుపెడతాం... అని రామానాయుడు స్పష్టం చేశారు.


More Telugu News