లోకేశ్ 'శంఖారావం... ఈ నెల 11 నుంచి ఉత్తరాంధ్ర పర్యటన

  • యువగళం స్ఫూర్తితో మరో యాత్రకు శ్రీకారం చుడుతున్న లోకేశ్
  • ఉత్తరాంధ్రలో కేడర్ తో వరుస సమావేశాలు
  • 11 రోజుల పాటు 31 నియోజకవర్గాలను కవర్ చేసేలా పర్యటన
ప్రజాచైతన్యమే లక్ష్యంగా సాగిన యువగళం పాదయాత్ర స్ఫూర్తితో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈనెల 11 నుంచి 'శంఖారావం' పేరుతో మరో యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. రానున్న ఎన్నికలకు పార్టీ కేడర్ ను కార్యోన్ముఖులను చేసే లక్ష్యంతో ఈసారి లోకేశ్ పర్యటన సాగనుంది. 

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ప్రారంభం కానున్న శంఖారావం యాత్ర ప్రతిరోజూ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగనుంది. 11 రోజుల పాటు 31 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఈ యాత్ర సాగనుంది. వార్డు స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో వివిధ వర్గాలకు భరోసా కల్పించనున్నారు. అధినేత చంద్రబాబు ప్రకటించిన 'సూపర్ సిక్స్' కార్యక్రమాలపై ప్రజలను చైతన్యవంతం చేయడం, తదితర అంశాలపై లోకేశ్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. 

నిర్ణీత రూట్ మ్యాప్ ప్రకారం ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లోకేశ్ ఆయా నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లి కేడర్ తో సమావేశమవుతారు. ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కరానికి అధికారంలోకి వచ్చాక చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో చర్చిస్తారు. తప్పుడు కేసులు, వేధింపులకు గురైన కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలకు లోకేశ్ భరోసా కల్పిస్తారు. 

గత ఏడాది జనవరి 27వతేదీన కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాలచెంత యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం 226 రోజుల పాటు 3132 కి.మీ.లు కొనసాగింది ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో విశాఖపట్నం పరిధిలోని అగనంపూడి వద్ద డిసెంబర్ 18వ తేదీన లోకేశ్ యువగళం పాదయాత్రను షెడ్యూల్ కంటే ముందే ముగించారు. 

తొలుత నిర్ణయించిన ప్రకారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో యువగళం పాదయాత్ర కొనసాగకపోవడంతో... ఆ ప్రాంతప్రజలు, కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు శంఖారావం పేరుతో నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేపడుతున్నారు. 

శంఖారావం మొదటి మూడు రోజుల షెడ్యూల్

11-2-24: ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి 
12-2-24: నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాలవలస
13-2-24: పాతపట్నం, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల్లో శంఖారావం కార్యక్రమం జరగనుంది.


More Telugu News