ప్రభుత్వాన్ని పడగొట్టాలనా?: జగన్, కేసీఆర్‌లపై నిప్పులు చెరిగిన జగ్గారెడ్డి

  • జగన్, కేసీఆర్ బీజేపీ ఆదేశాలతో పని చేస్తున్నారన్న జగ్గారెడ్డి 
  • తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ వద్ద జగన్ వకాలత్ తీసుకున్నారా? అని ప్రశ్న
  • ఇరవై మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరుతారని కేసీఆర్ కుటుంబం అభద్రతా భావంలో ఉందని విమర్శ
ఏపీ సీఎం జగన్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీ ఆదేశాలతోనే పని చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి విమర్శించారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు జగన్.. బీజేపీ వద్ద వకాలత్ తీసుకున్నారా? ప్రభుత్వాన్ని పడేయాలని బ్రోకర్ దుకాణం పెట్టావా? అని మండిపడ్డారు. 'మా గురించి మాట్లాడే విజయసాయిరెడ్డికి అసలు విలువలు ఉన్నాయా? ఆయన విలువ ఉన్న నాయకుడా?' అని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ అభివృద్ధి చెందకూడదని జగన్, కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు వచ్చే పెట్టుబడిదారులను, వ్యాపారవేత్తలను కేసీఆర్, కేటీఆర్ అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు.

తాము అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించామన్నారు. ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచామన్నారు. త్వరలో రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఈ రెండు పథకాలకు ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. కేసీఆర్ గత తొమ్మిదిన్నరేళ్ల కాలంలో ఎప్పుడైనా సచివాలయానికి వచ్చి కూర్చున్నారా? అని ప్రశ్నించారు. ఇంట్లో కూర్చొని ప్రభుత్వాన్ని నడిపారని ఆరోపించారు. ఇరవై మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని... అందుకే కేసీఆర్ కుటుంబం పూర్తిగా అభద్రతా భావంలో ఉందన్నారు.


More Telugu News