ఢిల్లీకి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర స్పందన

  • గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న టీడీపీ అధినేత
  • ఇరు పార్టీల మధ్య పొత్తుపై చర్చల కోసమేనంటూ వెలువడుతున్న ఊహాగానాలు
  • చంద్రబాబు ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా తమకు సంబంధం లేదన్న మంత్రి బొత్స సత్యనారాయణ
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. చర్చిద్దాం రమ్మంటూ బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆహ్వానించడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న ఆయన నేరుగా ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం రాత్రి 7.30 గంటల సమయంలో అమిత్ షాతో చంద్రబాబు సమావేశం కానున్నారు. కాగా ఈ భేటీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొననున్నారని తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై చర్చించనున్నారంటూ జోరుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. మరోవైపు ఏపీలో రాజకీయ పరిస్థితులు, ఓటర్ల జాబితాలో అక్రమాలు, విపక్ష నేతలపై దాడులు వంటి అంశాలపై నేతలు చర్చించనున్నట్టు సమాచారం. 

మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లడంపై ఏపీ మంత్రి, వైఎస్సార్‌సీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. చంద్రబాబు ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా తమకు సంబంధం లేదని, తమ నాయకుడు ఒంటరిగానే వెళతామని చెప్పారని ప్రస్తావించారు. ‘‘చంద్రబాబు ఢిల్లీ పర్యటన పొత్తుల కోసమా?.... అయితే అది జరిగితే అప్పుడు స్పందిస్తా’’ అని అన్నారు. ఇక ఏపీసీసీ చీఫ్ షర్మిల భద్రతపై స్పందిస్తూ.. తనకు కూడా గతంలో భద్రతను తొలగించారని, అప్పుడు తనకు ముప్పు లేదని భావించి మరింత స్వేచ్చగా తిరిగానని మంత్రి బొత్స వ్యంగ్యాస్త్రాలు సంధించారు. షర్మిలకు ఎప్పుడు సెక్యూరిటీ పెంచారో, ఎప్పుడు తగ్గించారో తనకు తెలియదని వ్యాఖ్యానించారు.


More Telugu News