సజ్జల వల్ల జగన్ కు తీవ్ర నష్టం జరగబోతోంది.. టీడీపీ-జనసేనకు 151 సీట్లు వస్తాయి: గోనె ప్రకాశ్ రావు

  • షర్మిలపై దుష్ప్రచారాన్ని ఆపకపోతే జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారన్న గోనె
  • ఎన్నికల తర్వాత జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని వ్యాఖ్య
  • రోజా, విడదల రజనీలకు టికెట్ రాదన్న గోనె
  • జగన్ ను నమ్ముకున్న టీఎస్ నేతలు రోడ్డున పడ్డారని మండిపాటు
  • చంద్రబాబు చరిత్ర తెలియకుండానే జగన్ మాట్లాడుతున్నారని విమర్శ
ఏపీ ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలపై తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఒక పిరికిపంద అని ఆయన అన్నారు. సజ్జల సలహాలతో జగన్ తీవ్రంగా నష్టపోబోతున్నారని చెప్పారు. షర్మిలపై దుర్మార్గపు ప్రచారాన్ని ఆపకపోతే... ఒక చరిత్ర హీనుడిగా జగన్ మిగిలిపోతారని అన్నారు. షర్మిల, తల్లి విజయమ్మ పట్ల జగన్ వ్యవహరిస్తున్న తీరు దారుణమని విమర్శించారు. 

బీజేపీతో పొత్తు వల్ల టీడీపీ, జనసేన కూటమికి బలం పెరుగుతుందని ప్రకాశ్ రావు చెప్పారు. టీడీపీ - జనసేన కూటమికి 151 సీట్లు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు. జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని... ఎన్నికల తర్వాత ఆయన అసెంబ్లీకి కూడా రారని చెప్పారు. వైసీపీ చిత్తుగా ఓడిపోబోతోందని సర్వేలు చెపుతున్నాయని అన్నారు. రోజా, విడదల రజనీకి కూడా జగన్ టికెట్లు ఇవ్వరని అన్నారు. కొత్త ఇన్ఛార్జీల్లో 35 మంది వరకు బీఫామ్ లు ఇవ్వరని చెప్పారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు చరిత్ర గురించి తెలియకుండా జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 1978లో చంద్రబాబు ఎమ్మెల్యే అయినప్పుడు జగన్ డైపర్లు వేసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. జగన్ ను నమ్ముకున్న తెలంగాణ నేతలు రోడ్డున పడ్డారని... కొండా సురేఖ రాజకీయంగా ఎంతో నష్టపోయారని చెప్పారు. పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప, పుట్టా మధు, బాజిరెడ్డి వంటి వాళ్లు జగన్ ను వదిలేయడం వల్ల రాజకీయంగా కుదురుకున్నారని అన్నారు. 

సోనియాగాంధీ కాళ్లు పట్టుకుని జగన్ జైలు నుంచి బయటకు వచ్చారని తెలిపారు. రిలయన్స్ పై దాడులు చేయించిన జగన్... రిలయన్స్ కు చెందిన పరిమళ్ కు రాజ్యసభ ఇచ్చారని విమర్శించారు. తండ్రిని చంపించిన వారితో డబ్బుల కోసం ఒప్పందాలు చేసుకున్నారని దుయ్యబట్టారు.


More Telugu News