బీసీల సంక్షేమం కోసం 56 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్న ఏపీ మంత్రి బుగ్గన

  • బీసీ సంక్షేమానికి రూ.71 వేల కోట్లు
  • ఇంటి గడప వద్దకే రేషన్ పంపిణీ
  • అగ్రిగోల్డ్ బాధితులకు రూ.884 కోట్లు
  • అసెంబ్లీలో మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రసంగం
రాష్ట్రంలోని బీసీల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం పాటుపడుతోందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. బడ్జెట్ సెషన్ లో భాగంగా బుధవారం అసెంబ్లీలో ఆయన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బీసీ సంక్షేమం కోసం రాష్ట్రంలో 56 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని, బీసీల కోసం రూ. 71,170 కోట్లు ఖర్చు చేశామని మంత్రి బుగ్గన తెలిపారు. ఇళ్లు లేని పేదలకు ఐదేళ్లలో తమ ప్రభుత్వం 30.65 లక్షల ఇళ్ల పట్టాలు అందించినట్లు వివరించారు. తమ హయాంలో రూ. 2.53 లక్షల కోట్ల నగదు బదిలీ చేశామని చెప్పారు. వైఎస్సార్ పెన్షన్ మొత్తాన్ని రూ.3 వేలకు పెంచి, రాష్ట్రంలోని 66.35 లక్షల మందికి అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ఈ ఐదేళ్లలో రూ. 84,731 కోట్లు వెచ్చించినట్లు మంత్రి వివరించారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రం తలసరి ఆదాయంలో తొమ్మిదో స్థానంలో ఉందని తెలిపారు.

రేషన్ సరుకులను లబ్దిదారుల ఇంటి వద్దకే పంపిస్తున్నామని, ఇందుకోసం 9,260 వాహనాలను సమకూర్చామని మంత్రి బుగ్గన తెలిపారు. వైఎస్సార్ బీమాకు రూ. 650 కోట్లు ఖర్చు చేశామని, కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలకు రూ.350 కోట్లు పంపిణీ చేశామని చెప్పారు. ఈబీసీ నేస్తం రూ.1,257 కోట్లు, కాపునేస్తం రూ.39,247 కోట్లు, నేతన్న నేస్తం కింద రూ.983 కోట్లు, జగనన్న తోడు కింద రూ.3,374 కోట్లు, జగనన్న చేదోడు కింద రూ.1,268 కోట్లు, వాహనమిత్ర కింద రూ.1305 కోట్లు అందించామని, అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు రూ.883.5 కోట్లు వెచ్చించామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో పేర్కొన్నారు.


More Telugu News