హెలికాఫ్టర్ ప్రమాదంలో చిలీ మాజీ అధ్యక్షుడి దుర్మరణం

  • రాంకో టౌన్‌లో హెలికాఫ్టర్ కూలడంతో ప్రమాదం
  • ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ మరో ముగ్గురు ప్రయాణికులు 
  • శోకసంద్రంలో కూరుకుపోయిన చిలీ, సంతాపం ప్రకటించిన పలు దేశాలు
దక్షిణ అమెరికా దేశమైన చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. మంగళవారం లాగో రాంకో టౌన్‌లో హెలికాఫ్టర్ కూలడంతో ఆయన మరణించారు. హెలికాఫ్టర్‌లోని మిగతా ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. పినేరా మృతదేహాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదంలో పినేరా మృతి విషయాన్ని దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి కెరొలీనా ధ్రువీకరించారు. మాజీ అధ్యక్షుడి మృతితో యావత్ దేశం శోక సంద్రంలో కూరుకుపోయింది. వివిధ దేశాధినేతలు తమ సంతాపం వ్యక్తం చేశారు. 

74 ఏళ్ల పినేరా రెండు సార్లు చిలీ దేశాధ్యక్ష పదవిని అధిష్టించారు. 2010-14, 2018-2022 మధ్య కాలంలో ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. తొలిసారి పినేరా అధ్యక్షుడయ్యాక చిలీ మంచి ఆర్థికాభివృద్ధి సాధించింది. పొరుగు దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆయన చిలీని ఆర్థిక పురోభివృద్ధి దిశగా నడిపించారు. దేశంలో నిరుద్యోగిత తగ్గేలా చేశారు. రెండో సారి అధ్యక్షుడయ్యాక ఆయనపై పలు విమర్శలు తలెత్తాయి. దేశవ్యాప్తంగా పలు హింసాత్మక ఘటనలు, మానవహక్కుల ఉల్లంఘనలు వెలుగు చూశాయి. 

గొప్ప వ్యాపారవేత్తగా ఖ్యాతి గడించిన పినేరా 1980ల్లో దేశంలో తొలిసారిగా క్రెడిట్ కార్డులు ప్రవేశపెట్టి సంపన్నుడిగా మారారు. ఆయన సంపద నికర విలువ 2.7 బిలియన్ డాలర్లని సమాచారం.


More Telugu News