చనిపోయిన తండ్రిపై ఎఫ్ఐఆర్ వేసుకోమని చెప్పిన వ్యక్తి ఈ జగన్: చంద్రబాబు

  • చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో రా.. కదలిరా సభ
  • సీఎం జగన్ పై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించిన చంద్రబాబు
  • పులివెందుల పంచాయితీ అంటూ జగన్, షర్మిల అంశం ప్రస్తావన
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఏర్పాటు చేసిన రా.. కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేశపూరిత ప్రసంగం చేశారు. సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ రోజు పులివెందుల పంచాయితీ ఒకటి తయారైందని అన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అడ్డంగా దోచేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అంటూ ఆరోపించారు. 

"వైఎస్సార్ చనిపోయాక మొత్తం అవినీతి బయటికి వచ్చింది. రూ.42 వేల కోట్ల మేర అవినీతి జరిగిందని సీబీఐ చెప్పింది. ఆ సమయంలో కేసుల నుంచి తప్పించుకోవడానికి జగన్ ప్రయత్నించాడు. చనిపోయిన తన తండ్రిపై ఎఫ్ఐఆర్ వేసుకోమని చెప్పాడు... తనకేమీ సంబంధం లేదని అన్నాడు. జగన్ జైల్లో ఉన్నప్పుడు నేను పాదయాత్ర చేస్తుంటే, నాకు కౌంటర్ గా తన చెల్లితో పాదయాత్ర చేయించాడు. 

2019 ఎన్నికల ముందు బాబాయ్ ని గొడ్డలితో చంపింది ఎవరు? సానుభూతి పొందింది ఎవరు? కోడికత్తి శ్రీను ఘటన ఏమైంది? కోడికత్తి ఘటనలో శ్రీను మాత్రం ఐదేళ్లుగా జైల్లో ఉంటే, బాబాయ్ ని చంపిన వ్యక్తి మాత్రం రోడ్డుపై తిరుగుతున్నాడు. ఆ రోజు కుటుంబాన్నే మోసం చేశాడు... ఇవాళ వివేకా కూతురుపైనే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చాడు. 

ఇప్పుడు చెల్లెలు తిరగబడింది... ఆస్తిలో వాటాల పంపకం సరిగా జరగలేదు... దీనిపై అడిగితే ఇవ్వను పొమ్మన్నాడు... వాళ్లు వాళ్లు కొట్టుకుని ఇప్పుడు రోడ్డెక్కే పరిస్థితికి వచ్చారు. అంతఃపుర రహస్యాలన్నీ బయటికి వస్తున్నాయి. 

పులివెందుల పులి అని చెప్పుకునే ఈ జగన్ మోహన్ రెడ్డి ఆనాడు రాత్రికి రాత్రి తన బావ అనిల్  ను, భార్యను ఢిల్లీకి రాయబారం పంపి, సోనియా గాంధీ కాళ్లు పట్టుకుని బెయిల్ తెచ్చుకున్నాడు. ఇవాళ జగన్ మనల్ని విమర్శిస్తున్నాడు. 

మీరు, మీ చెల్లెలు వ్యవహారం ఇది. పులివెందులకు సంబంధించిన వ్యవహారం ఇది. మాకు సంబంధంలేదు. ఆ రోజు పాదయాత్ర చేయమని మేం చెప్పామా? నువ్వే చేయించుకున్నావు. ఆస్తుల పంపకం గురించి మేం చెప్పామా... మీరే పంపకం చేసుకున్నారు. మీ బాబాయిని మీరే చంపుకున్నారు. చివరికి నాపై అపవాదు వేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు తప్ప... మీరేమీ చేయలేకపోయారు. మీ కుటుంబ వ్యవహారాన్ని రాష్ట్ర వ్యవహారంగా చిత్రీకరించే పరిస్థితికి వచ్చారు" అంటూ చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు.


More Telugu News