కుక్క బిస్కట్ వివాదంపై రాహుల్ గాంధీ వివరణ

  • తాను కుక్కకు బిస్కట్ తినిపించాలని భావించానన్న రాహుల్ గాంధీ
  • తన చేతితో ఇస్తే తినకపోవడంతో, కార్యకర్త అయిన కుక్క యజమానికి తినిపించమని ఇచ్చినట్లు వెల్లడి
  • ఇందులో వివాదం ఎక్కడ ఉందో అర్థం కావడం లేదన్న కాంగ్రెస్ అగ్రనాయకుడు
భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ కార్యకర్త చేతికి కుక్క బిస్కట్లు ఇచ్చినట్టుగా వైరల్ అయిన వీడియోపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ కాంగ్రెస్ అగ్రనేతపై ఇప్పటికే విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ తన కార్యకర్తలకు కుక్క తినే బిస్కట్లు ఇస్తున్నారని... కార్యకర్తలను కుక్కల్లా చూస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇతర బీజేపీ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. 

రాహుల్ గాంధీ బిస్కట్లు వేయగా ఓ కుక్క తినలేదు. దీంతో తన చేతిలోని బిస్కట్లను రాహుల్ గాంధీ ఓ కార్యకర్త చేతికి ఇచ్చారు. కుక్క తినడానికి ఇష్టపడని బిస్కట్‌ను కార్యకర్తకు అందిస్తున్నట్లుగా వీడియోలో ఉంది. ఇది వైరల్ కావడం... బీజేపీ నేతలు విమర్శించడంతో రాహుల్ గాంధీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. 

తాను బిస్కట్ ఇవ్వాలనుకున్న కుక్కపిల్ల తమ పార్టీ కార్యకర్తదే అన్నారు. ఆ కుక్కపిల్ల తాను ఇచ్చిన బిస్కట్ తినకపోవడంతో, యజమాని చేతికి ఇచ్చి పెట్టమన్నానని స్పష్టం చేశారు. కుక్కను చూస్తే ముచ్చటేసిందని... దీంతో బిస్కట్ ఇచ్చేందుకు ప్రయత్నించానని రాహుల్ గాంధీ చెప్పారు. అయితే కుక్క భయపడి వణికిందని... తాను బిస్కట్ ఇచ్చినప్పటికీ వణికిపోయిందన్నారు. దీంతో ఆ బిస్కట్‌ను కుక్క యజమాని అయిన తన కార్యకర్త చేతికి ఇచ్చి... నీ చేతితోనే తింటుంది... తినిపించండి అని ఇచ్చానని చెప్పారు. ఆ యజమానికి బిస్కట్ ఇవ్వడంతో కుక్క తిన్నట్లు వెల్లడించారు. ఇందులో ఇబ్బంది ఏముందో అర్థం కావడం లేదన్నారు. ఇందులో వివాదం చేయడానికి ఏమీ లేదన్నారు.

ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో ఫిబ్రవరి 4న భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా ఈ వీడియో చిత్రీకరించినట్లు పార్టీ అధికార ప్రతినిధి రాకేశ్ సిన్హా తెలిపారు. రాహుల్ గాంధీ తన కుక్కకు బిస్కట్లు తినిపించే ప్రయత్నం చేశారని... ఆ కుక్క యజమాని హర్షం వ్యక్తం చేశాడని రాకేశ్ సిన్హా పేర్కొన్నారు.


More Telugu News