జగన్ పాలనలో రాష్ట్రం ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు: భానుప్రకాశ్ రెడ్డి

  • జగన్ నేల మీద కాకుండా గాల్లో తిరుగుతున్నారని భానుప్రకాశ్ రెడ్డి విమర్శ
  • రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని మండిపాటు
  • సంక్షేమ రాష్ట్రాన్ని సంక్షోభ రాష్ట్రంగా మార్చారని విమర్శ
ఎన్నికల ముందు ముద్దులు, గెలిచాక గుద్దులని ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి విమర్శించారు. జగన్ నేల మీద కాకుండా గాల్లో తిరుగుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని... కానిస్టేబుల్ గణేశ్ ను ఎర్రచందనం స్మగ్లర్లు చంపేశారని... వీరి వెనకున్న అసలైన వ్యక్తులను పట్టుకునే దమ్ము ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారం, ఆయుధాలు లేని శాఖగా టాస్క్ ఫోర్స్ మారిందని చెప్పారు. 

సర్పంచ్ లు వారి హక్కుల కోసం పోరాడితే దాడులు చేస్తారా? అని భాను ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. గ్రామాల్లో సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేశారని అన్నారు. సంక్షేమంగా ఉన్న రాష్ట్రాన్ని... సంక్షోభ రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులు కాకుండా... రాష్ట్రం నుంచి ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ పాలనలో రాష్ట్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని అన్నారు.


More Telugu News