TS నుంచి TGకి మార్పు... వారు మార్చుకోవాల్సిన అవసరం లేదన్న మంత్రి పొన్నం

  • తెలంగాణ ఏర్పడిన తర్వాత పాత వాహనాలకు 'ఏపీ' పేరు అలాగే ఉందన్న మంత్రి పొన్నం
  • కొత్త వాహనాలు మాత్రమే టీజీగా రిజిస్ట్రేషన్ అవుతాయని స్పష్టీకరణ
  • బీసీ కులగణన చేపడతామన్న పొన్నం ప్రభాకర్
  • రిజర్వేషన్లు 50 శాతం దాటినా అమలు చేస్తామని వెల్లడి
పాత వాహనదారులు TS నుంచి TGకి మార్చుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాత వాటికి AP ఉండగా... కొత్త బండ్లకు మాత్రమే TSగా కొత్త రిజిస్ట్రేషన్ అయిందని గుర్తు చేశారు. రేపటి నుంచి TS రిజిస్ట్రేషన్ బండ్లు అలాగే ఉంటాయని... కొత్త బండ్లు మాత్రమే TGగా రిజిస్ట్రేషన్ అవుతాయని మంత్రి చెప్పారు. ఓ టీవీ ఛానల్ ముఖాముఖిలో ఆయన బీసీ కులగణన, వాహనాల రిజిస్ట్రేషన్ TS నుంచి TGకి మార్పు వంటి అంశాలపై స్పందించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... రిజర్వేషన్లు 50 శాతం దాటినా అమలు చేస్తామన్నారు. బీసీ కులగణనకు మంత్రివర్గం ఆమోదించిందని... అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టబద్ధత తీసుకు వస్తామన్నారు. మేధావులతో చర్చించి బీసీ కులగణన చేపడతామని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందా? తర్వాత? అనే అంశంపై చర్చ అవసరం లేదని.. సాధ్యమైనంత త్వరగా కులగణన చేపడతామని వెల్లడించారు. బీసీలకు న్యాయం జరగాలంటే కులగణన అవసరమని వ్యాఖ్యానించారు. ఇది తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచన అన్నారు. ఈ ఆలోచనను బీజేపీ వ్యతిరేకిస్తోందని ఆరోపించారు.

తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలలోను, అలాగే కేంద్రంలో అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేస్తామని తేల్చి చెప్పారు. రిజర్వేషన్లు 50 శాతం దాటినా అమలు చేస్తామన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లు, వివిధ పథకాలకు నిధులు కేటాయించాలంటే బీసీ కులగణన అవసరమని అభిప్రాయపడ్డారు. పదేళ్ల పాలనలో ప్రజలను, రాష్ట్రాన్ని పట్టించుకోని నేతలు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో బీసీ కులగణన చేపట్టి రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ఈ అంశంపై చిత్తశుద్ధి లేని ప్రతిపక్షాలు తమపై విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు.


More Telugu News