ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ స్థానంలో పాండ్యా‌ను ఎంపిక చేయడానికి కారణం చెప్పిన కోచ్ మార్క్ బౌచర్

  • జట్టు మార్పులో భాగంగానే నిర్ణయం తీసుకున్నామని వెల్లడి
  • ఇది పూర్తిగా క్రికెట్‌కు సంబంధించిన నిర్ణయమని వ్యాఖ్య
  • ఇండియన్ ఫ్యాన్స్ భావోద్వేగానికి గురవుతుంటారన్న మార్క్ బౌచర్
  • రోహిత్ శర్మపై భారం తగ్గాలని కోరుకుంటున్నట్టు వెల్లడి
ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాను నియమిస్తూ యాజమాన్యం ప్రకటించడం క్రికెట్ వర్గాల్లో ఎంతటి చర్చకు దారితీసిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే కెప్టెన్ మార్పుపై ఆ జట్టు కోచ్ మార్క్ బౌచర్ స్పందించారు. కెప్టెన్సీ మార్పు నిర్ణయం పూర్తిగా క్రికెట్‌పరమైనదని ఆయన వ్యాఖ్యానించారు. జట్టు ప్రస్తుతం రూపాంతర దశలో ఉందని, ఇందులో భాగంగానే హార్దిక్‌ను ప్రత్యేక విధానంలో దక్కించుకున్నామని ప్రస్తావించారు. భారతీయులు చాలా భావోద్వేగానికి గురవుతారని, ఈ విషయం చాలామందికి తెలియదని అన్నారు. క్రికెట్ విషయంలో భావోద్వేగాలకు దూరంగా ఉండాలని అన్నారు. ఇది కేవలం క్రికెట్‌తో ముడిపడిన నిర్ణయం మాత్రమేనని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. కెప్టెన్సీ మార్పు నిర్ణయంతో ఒక ఆటగాడిగా రోహిత్ శర్మ నుంచి అత్యుత్తమ ప్రదర్శన వస్తుందని భావిస్తున్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

రోహిత్‌ని స్వేచ్ఛగా ఆడనివ్వాలని, మంచి స్కోర్ సాధించనివ్వాలని అన్నారు. ‘స్మాష్ స్పోర్ట్స్ పోడ్‌కాస్ట్‌’లో మార్క్ బౌచర్ ఈ విధంగా స్పందించారు. రోహిత్ కెప్టెన్సీ మార్పు నిర్ణయాన్ని ఐపీఎల్‌లో ఆటతో సంబంధంలేని నిర్ణయంగా భావించాలని మార్క్ బౌచర్ వ్యాఖ్యానించాడు. రోహిత్‌పై భారం తగ్గాలని తాను భావిస్తున్నానని, బ్యాటర్‌గా అత్యుత్తమ ప్రదర్శన చేసి ఆస్వాదించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

కాగా రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను ముంబై కెప్టెన్‌గా ప్రకటించడంపై క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఐదుసార్లు ముంబైని టైటిల్ విజేతగా నిలిపిన కెప్టెన్‌ను ఏ విధంగా తప్పిస్తారంటూ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా ఐపిఎల్ 2024 సీజన్‌‌కు గుజరాత్ టైటాన్స్ నుంచి ప్రత్యేక ట్రేడింగ్ ద్వారా హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.  రోహిత్ శర్మ వయసు ప్రస్తుతం 36 సంవత్సరాలు కావడం, మరోవైపు పాండ్యా ట్రాక్ రికార్డును దృష్టిలో ఉంచుకొని ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.


More Telugu News