బీఆర్ఎస్‌కు పోరాటం కొత్త కాదు... తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం: కేసీఆర్

  • కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులు వెళితే మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందన్న కేసీఆర్
  • కృష్ణా జలాలపై, ప్రాజెక్టులపై వాటాను, హక్కులను కాపాడేందుకు ఎంతదాకైనా పోరాటం చేద్దామన్న కేసీఆర్
  • కాంగ్రెస్ నిర్ణయంతో భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టల మీదికి కూడా పోలేని పరిస్థితి దాపురించిందని వ్యాఖ్య
బీఆర్ఎస్‌కు పోరాటం కొత్తకాదని... తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మూడు నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్‌కు వచ్చారు. ఆయనకు మహిళా కార్యకర్తలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రతినిధులతో సమీక్షలో మాట్లాడుతూ... కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులు వెళితే మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందన్నారు. డ్యామ్‌కు సున్నం వేయాలన్నా కేఆర్ఎంబీ అనుమతి తప్పనిసరి అన్నారు.

కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా ఎండగడుతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాదకర మూర్ఖపు వైఖరిని తిప్పికొట్టి కృష్ణా జలాలపై, ప్రాజెక్టులపై తెలంగాణకు రావాల్సిన వాటాను, హక్కులను నూటికి నూరు శాతం కాపాడేందుకు ఎంతదాకనైనా పోరాడాల్సిందేనని పిలుపునిచ్చారు. ఉద్యమం సమయంలో సాగునీరు, తాగునీటి హక్కుల కోసం పోరాడడమే కాకుండా 'మా నీళ్లు మాకే' అనే ప్రజానినాదాన్ని... స్వయంపాలన ప్రారంభమైన అనతికాలంలోనే నిజం చేసి చూపించిన ఘనత బీఆర్ఎస్ పార్టీది అన్నారు.

కేఆర్ఎంబీ పేరుతో కృష్ణా నదీ ప్రాజెక్టులపై తెలంగాణకు ఉన్న హక్కులను కైవసం చేసుకునేందుకు కేంద్రం వేసే ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ కేంద్రం ఒత్తిళ్లను తట్టుకుంటూ పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసి కాపాడిందన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ అవగాహన రాహిత్యంతో సంతకాలు చేసి తీసుకున్న నిర్ణయంతో భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టలమీదికి కూడా పోలేని పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు.

దీన్ని ప్రజా మద్దతుతో తిప్పికొడుతామన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగునీరు తాగునీరు అందక తిరిగి కరవుకోరల్లో చిక్కుకునే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాదకర మూర్ఖపు వైఖరిని తిప్పికొట్టి కృష్ణా జలాలపై ప్రాజెక్టులపై తెలంగాణకు రావాల్సిన వాటాను హక్కులను నూటికి నూరుశాతం కాపాడేందుకు ఎంత వరకైనా పోరాడాలన్నారు.


More Telugu News