విండీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్‌ను తుపాకితో బెదిరించిన దుండగులు

  • సౌతాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో ఘటన
  • బస చేసిన హోటల్ సమీపంలోనే తుపాకి గురిపెట్టి ఫోన్ సహా ఇతర వస్తువులు ఎత్తుకెళ్లిన దొంగలు
  • తుపాకి గురిపెట్టడంతో వణికిపోయిన ఫాబియన్
  • ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పార్ల్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం
  • క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైన దోపిడీ ఘటన
విండీస్ స్టార్ ఆల్ రౌండర్ ఫాబియన్ అలెన్‌ను తుపాకితో బెదిరించిన దోపిడీ దొంగలు అతడి ఫోన్‌తోపాటు మరికొన్ని వస్తువులను లాక్కెళ్లారు. తుపాకి గురిపెట్టడంతో వణికిపోయిన అలెన్ దొంగలు అడిగినవి కిమ్మనకుండా సమర్పించుకున్నాడు. విండీస్ బోర్డు అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించడంతో క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌‌బర్గ్‌లో జట్టు బస చేసిన శాండ్‌టన్ సన్ హోటల్ సమీపంలోనే ఈ ఘటన జరిగింది.

అంతర్జాతీయ ఆటగాడికి కనీస భద్రత లేకుండా పోయిందని, సౌతాఫ్రికాలో ఇలాంటి పరిస్థితిని ఊహించలేదంటూ క్రికెట్ అభిమానులు వాపోతున్నారు. సౌతాఫ్రికా బోర్డుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అలెన్ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాడని విండీస్ బోర్డు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనపై సౌతాఫ్రికా క్రికెట్ వర్గాలు ఇప్పటి వరకు స్పందించలేదు.

అలెన్ ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పార్ల్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో అలెన్ దారుణ ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నాడు. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడి 38 పరుగులు మాత్రమే చేశాడు.


More Telugu News