మెగాస్టార్ కెరియర్లో మరో మైలురాయినే 'విశ్వంభర'

  • మెగా సినిమాగా 'విశ్వంభర'
  • సోషియో ఫాంటసీ జోనర్లో నడిచే కథ 
  • విజువల్ వండర్ గా నిలిచే సినిమా
  • ప్రాజెక్టుపై పెరుగుతున్న అంచనాలు 

చిరంజీవి .. ఒక పేరు కాదు .. ఒక సంచలనం. ఉప్పెనలాంటి ఉత్సాహంతో ఆయన తెరపైకి దూసుకుని వచ్చారు. అప్పటి వరకూ తెలుగు సినిమాలు పరుగెడుతున్న గమనాన్ని .. గమ్యాన్ని మార్చేశారు. అంతవరకూ నిదానంగా .. నింపాదిగా తమ ప్రాజెక్టులను చేస్తూ వెళుతున్న దర్శక నిర్మాతలను ఆయన పరుగులు పెట్టించారు. ఆయన రాకతో తెలుగు సినిమాకి సంబంధించిన ప్రతి అంశంలోనూ ఒక కొత్త కదలిక మొదలైంది. ఆ తరువాత అంతగా ప్రభావితం చేసిన హీరోలు ఇంతవరకూ రాలేదు. 

చిరంజీవి చేయని జోనర్లు .. అనుసరించని ఆధునిక పద్ధతులు దాదాపుగా కనిపించవు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఆయన చాలా కాలం క్రితమే 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమా చేశారు. ఆ సినిమా సమయానికి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం చాలా తక్కువ. అయినా అది ఆయన కెరియర్లో ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలిచిపోయింది. ఇక గ్రాఫిక్స్ కి ప్రాధాన్యత ఉన్న  సినిమాగా 'అంజి' కనిపిస్తుంది. అప్పట్లో ఆ సినిమా ఆశించిన స్థాయి వసూళ్లను అందుకోలేకపోయినా, ఇప్పటికీ టీవీల్లో చూస్తూ పిల్లలు ఎంజాయ్ చేస్తుంటారు. 

ఇక ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేసింది. భారీ బడ్జెట్ కేటాయించగలిగితే, తెరపై చూపించడానికి అసాధ్యమైనది లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే చిరంజీవి సోషియో ఫాంటసీ సినిమాగా 'విశ్వంభర' చేస్తున్నారు. ఆయన సినిమాకి తప్ప మరెవరికీ ఈ టైటిల్ పెట్టినా హెవీగానే అనిపించేది. ఓ సాధారణ మానవుడి సాహసాలు .. దేవలోకం .. దేవకన్యలతో ఒక అద్భుతమైన ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లనుంది. ఈ ప్రాజెక్టు నుంచి వస్తున్న అప్ డేట్స్ చూస్తుంటే, ఇది ఆయన కెరియర్లో మరో మైలురాయిగా నిలిచిపోవడం ఖాయమనే అనిపిస్తోంది. 


More Telugu News