వైసీపీలో మరో వికెట్ డౌన్.. నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే గాంధీ!

  • వైసీపీలో ఉన్న కుల రాజకీయాలతో విసిగి పోయానన్న ఆర్. గాంధీ
  • దళితుడిని కావడం వల్ల మంత్రి పెద్దిరెడ్డి గుర్తింపు ఇవ్వడం లేదని మండిపాటు
  • పెద్దరెడ్డికి అణిగి ఉంటేనే పదవులు దక్కుతాయని వ్యాఖ్య
 చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు ఆర్. గాంధీ పార్టీని వీడుతున్నారు. వైసీపీలో దళితులకు అన్యాయం జరుగుతోందని... అందుకే తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశానని ఆయన తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 

తాను దళితుడిని కావడం వల్ల మంత్రి పెద్దిరెడ్డి తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదని ఈ సందర్భంగా గాంధీ అసహనం వ్యక్తం చేశారు. తనకు పదవులు, గౌరవం దక్కకుండా పెద్దిరెడ్డి అడ్డుకున్నారని మండిపడ్డారు. తన సమస్యలను చెప్పుకోవడానికి అపాయింట్ మెంట్ అడిగినా సీఎం జగన్ ఇవ్వలేదని అన్నారు. అపాయింట్ మెంట్ కోసం సీఎం కార్యాలయ అధికారులను వేడుకున్నప్పటికీ... వారు స్పందించలేదని చెప్పారు. దీంతో తాను తీవ్ర మనోవేదనకు గురయ్యానని తెలిపారు. 

పెద్దిరెడ్డికి అణిగి ఉంటేనే పదవులు, గౌరవం దక్కుతాయని గాంధీ చెప్పారు. ఎంపీ రెడ్డెప్ప ఏ రోజూ పెద్దిరెడ్డి ముందు కూర్చోలేదని... ఓ ఎంపీకే ఇలాంటి దారుణ పరిస్థితి ఉంటే... ఇక సామాన్య దళిత నాయకులు, కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని అన్నారు. వైసీపీలో ఉన్న కుల రాజకీయాలతో విసిగిపోయానని.... మంగళవారం గంగాధరనెల్లూరులో జరిగే చంద్రబాబు సభలో ఆయన సమక్షంలో టీడీపీలో చేరుతున్నానని తెలిపారు. 1994 - 1999 మధ్య కాలంలో గాంధీ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2011లో ఆయన వైసీపీలో చేరారు.


More Telugu News