బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు ‘ఇన్ఫోసిస్’ చిక్కులు

  • ఇన్ఫోసిస్‌పై బ్రిటన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందన్న ప్రతిపక్ష లేబర్ పార్టీ
  • బ్రిటన్‌లో ఇన్ఫోసిస్ విస్తరణకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆరోపణ
  • ఈ తీరు పలు సందేహాలకు తావిస్తోందన్న ప్రతిపక్షం
భారత టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై బ్రిటన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందంటూ ప్రతిపక్ష లేబర్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ప్రధానితో సంస్థ వ్యవస్థాపకుడు నారాయణమూర్తికి ఉన్న బంధుత్వం నేపథ్యంలో బ్రిటన్‌లో ఇన్ఫోసిస్ విస్తరణకు ప్రభుత్వం అదనపు సాయం చేస్తామని కూడా హామీ ఇచ్చిందని లేబర్ పార్టీ మండిపడింది. బ్రిటన్ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారిన ఈ ఆరోపణలు ప్రధాని రిషి సునాక్‌ను ఇబ్బందుల్లో పడేశాయి. 

బ్రిటన్ మీడియా కథనాల ప్రకారం, గతేడాది ఏప్రిల్‌లో బ్రిటన్ వాణిజ్య మంత్రి లార్డ్ డామినిక్ జాన్సన్ భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా బెంగళూరులోని ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన యూకేలో సంస్థ కార్యకలాపాలపై కూడా చర్చలు జరిపారు. ఇన్ఫోసిస్ తన వ్యాపారాన్ని బ్రిటన్‌లో కూడా విస్తరించాలని ఆయన కోరినట్టు బ్రిటన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 

ఈ కథనాల నేపథ్యంలో ప్రతిపక్షం బ్రిటన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. ఇన్ఫోసిస్‌పై ప్రభుత్వం కనబరుస్తున్న ప్రత్యేక శ్రద్ధ పలు సందేహాలకు తావిస్తోందని లేబర్ పార్టీ నేత జానథన్ యాష్‌వర్త వ్యాఖ్యానించారు. 

ఈ ఆరోపణలపై బ్రిటన్ వ్యాపార వాణిజ్య శాఖ కూడా స్పందించింది. ఇన్వెస్ట్‌మెంట్స్ మంత్రి తరచూ భారత్‌ సహా వివిధ దేశాల్లోని కంపెనీలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులతో సమావేశమవుతారని పేర్కొంది. బ్రిటన్‌లో పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారని పేర్కొంది. పెట్టుబడులతో బ్రిటన్ ప్రజలకు వేలాది ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేసింది.


More Telugu News