ఖమ్మం నుంచి పోటీ చేయండి: సోనియా గాంధీని కోరిన రేవంత్ రెడ్డి, మల్లు భట్టి

  • సోనియా గాంధీతో అరగంటపాటు సమావేశమైన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి  
  • తెలంగాణ నుంచి తీర్మానం చేసి పంపినట్లు సోనియా గాంధీకి చెప్పామన్న ఉపముఖ్యమంత్రి
  • తెలంగాణలో అమలు చేస్తోన్న... చేయనున్న హామీలను వివరించామన్న మల్లు భట్టి
పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని కోరారు. సోమవారం ఢిల్లీలో అగ్రనాయకురాలితో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం నుంచి పోటీ చేయాలని కోరారు. ఆమెతో వారు అరగంట పాటు సమావేశమయ్యారు. భేటీ అనంతరం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరాం: మల్లు భట్టి

ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి మర్యాదపూర్వకంగా ఆమెను కలిశామని మల్లు భట్టి చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఆమెను కోరినట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర పార్టీ నుంచి తీర్మానం చేసి పంపినట్లు సోనియా గాంధీ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు.

అదే సమయంలో తెలంగాణలో అమలు చేసిన... అమలు చేయబోయే గ్యారెంటీలను ఆమె దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకంలో గడిచిన రెండు నెలల్లో 15 కోట్ల జీరో టిక్కెట్లు రికార్డ్ అయినట్లు అగ్రనాయకురాలికి వివరించినట్లు తెలిపారు. త్వరలో మరో రెండు గ్యారెంటీలను అమలు చేయనున్న విషయం ఆమె దృష్టికి తీసుకు వెళ్లామన్నారు.


More Telugu News