అన్నా మీరు ఎప్పుడైనా మేడారం జాతరకు వచ్చారా?: మంత్రులు సీతక్క, పొన్నం మధ్య ఆసక్తికర సంభాషణ

  • ఉద్యమం సమయంలో వచ్చి అమ్మవార్లకు మొక్కుకున్నట్లు తెలిపిన పొన్నం
  • పార్లమెంటులో విభజన బిల్లును ప్రవేశపెట్టిన రోజునే అమ్మవార్లు వనం నుంచి గద్దెల వద్దకు వచ్చారని గుర్తు చేసుకున్న పొన్నం
  • మేడారంకు జాతీయ గుర్తింపు రావాలన్న సీతక్క
తెలంగాణ మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ మధ్య సోమవారం ఆసక్తికర సంభాషణ జరిగింది. అన్నా మీరు ఎప్పుడైనా మేడారం జాతరకు వచ్చారా? అని సీతక్క అడిగారు. ఉద్యమం సమయంలో వచ్చి అమ్మవార్లకు మొక్కుకున్నట్లు పొన్నం తెలిపారు. జాతరలో రవాణా సదుపాయాల సమీక్ష కోసం మంత్రులు ఇద్దరూ ఒకే వాహనంలో హైదరాబాద్ నుంచి మేడారం వెళుతున్న సమయంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సీతక్క ప్రశ్నించగా... పొన్నం తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

తెలంగాణ ఏర్పాటు కావాలని మొక్కుకున్నాను

అన్నా... ఎప్పుడైనా మేడారం జాతరకు వచ్చారా? అని మంత్రి సీతక్క అడగగా... చాలాసార్లు వచ్చాను కానీ, చిన్నప్పటి విషయాలు జ్ఞాపకం లేవు కానీ... తాను ఎంపీ అయ్యాక తెలంగాణ ఏర్పాటు కావాలని 2013లో సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2014 ఫిబ్రవరి 13న విభజన బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన రోజునే ఇక్కడ మేడారంలో వనం నుంచి దేవతలు గద్దెల వద్దకు వచ్చారని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు మంత్రులు ఉద్యమం నాటి జ్ఞాపకాలను పరస్పరం పంచుకున్నారు. అమ్మవార్లకు మహిమలు ఉన్నాయని చెప్పేందుకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయని సీతక్క అన్నారు. లక్షలాది మంది మేడారంకు వచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళుతున్నారంటే అది అమ్మవారి దయ మాత్రమే అన్నారు.

మేడారం జాతరకు జాతీయ గుర్తింపు రావాలన్న సీతక్క

మేడారం మహా జాతరకు జాతీయ హోదా గుర్తింపు రావాల్సి ఉందని మంత్రి సీతక్క అన్నారు. ఆసియా అతిపెద్ద గిరిజన జాతరకు అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఈ జాతర జరుగుతుందన్నారు. రూ.105 కోట్లతో మేడారం జాతర పనులు చేపట్టినట్లు తెలిపారు.

ఆరువేల ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామన్న పొన్నం

మేడారం జాతరకు ఆరువేల ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జాతర కోసం ప్రభుత్వం... ఆర్టీసీకి 2.25 కోట్ల రూపాయల నిధులు మంజురు చేసినట్లు తెలిపారు. మేడారంలో భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.


More Telugu News