ఏం చెయ్యాలి ఈ దుర్మార్గుడ్ని... ఉతికి ఉతికి ఆరెయ్యాలి!: చంద్రబాబు

  • చింతలపూడిలో చంద్రబాబు రా కదలిరా సభ
  • ప్రభుత్వాన్ని దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న చంద్రబాబు
  • అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించావంటూ సీఎం జగన్ పై ధ్వజం
  • రాష్ట్రాన్ని మళ్లీ పునర్ నిర్మించుకోవాల్సి ఉందంటూ పిలుపు
టీడీపీ అధినేత చంద్రబాబు ఏలూరు జిల్లా చింతలపూడిలో 'రా కదలిరా' సభలో వాడీవేడిగా ప్రసంగించారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, మిమ్మల్ని భరించే పరిస్థితిలో ప్రజలు లేరని స్పష్టం చేశారు. 

"నువ్వు దిగిపోతే దిగిపోయావు... మా తమ్ముళ్ల పరిస్థితి ఏంటి? వాళ్ల ఉద్యోగాల పరిస్థితి ఏంటి? వాళ్ల జీవితాలు నాశనం చేశావు. రూ.12 లక్షల కోట్ల అప్పు చేశావు. అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించావు. మళ్లీ ఇటుక ఇటుక పేర్చుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. మళ్లీ ఈ రాష్ట్రంలో వెలుగులు నింపుతాం. ఆ శక్తి మనకు ఉంది" అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.

ఆయన అర్జునుడు అంట!

నిన్న మాట్లాడుతూ జగన్ అంటున్నాడు... ఆయన అర్జునుడంట! అర్జునుడు కాదు అక్రమార్జునుడు. అతడు డబ్బుల మీద డబ్బులు మీ ఇంటికి పంపిస్తున్నాడంట. డబ్బులు కాదు... దెబ్బ మీద దెబ్బ! మీ ఖాతాల్లో డబ్బులే డబ్బులంట. ఇచ్చేది రూ.10... దోచుకునేది రూ.100. తొమ్మిది సార్లు కరెంటు చార్జీలు పెంచాడు... గతంలో రూ.200 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు రూ.1000 వస్తోంది. కరెంటు చార్జీల ద్వారా రూ.64 వేల కోట్లు వసూలు చేస్తున్నాడు. 

మద్యంలోనూ అంతే. పాపం... మా తమ్ముళ్లలో మందుబాబులు కూడా ఉన్నారు. పగలంతా పని చేసి సాయంత్రం పెగ్గు వేయడం వారికి అలవాటు. వారి బలహీనతను ఆసరాగా చేసుకుని ప్రైవేటు బ్రాండ్లు తీసుకువచ్చాడు. 

ఒకప్పుడు రూ.60గా ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200. అందులో రూ.150 జగన్ కు కమీషన్ వెళుతుంది. మీ తాగుడు ద్వారా నెలకు రూ.4500 చొప్పున జలగ పీల్చేస్తున్నాడు. ఇది న్యాయమా? ఏం చేయాలి ఇతడ్ని... ఉతికి ఉతికి ఆరేయాలా వద్దా? ఈ మద్యం తాగి 30 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు, 30 వేల మంది చనిపోయారు. ఈ జలగ మాత్రం బాగుపడుతున్నాడు. 

ఇంటి పన్ను, చెత్త పన్ను, ఆర్టీసీ చార్జీలు కూడా పెంచేస్తున్నాడు. వీటన్నింటితో మీ ఖాతాలో డబ్బులు ఖాళీ కావడం లేదా. అందుకే చెబుతున్నా... ఇచ్చేది రూ.10... దోచుకునేది రూ.100. అయ్యా జగన్ నువ్వు అర్జునుడివి కాదు... అక్రమార్జునుడివి. కలియుగంలో మన కర్మ కాలి ఈ ముఖ్యమంత్రి పుట్టాడు... ఓ బకాసురుడి మాదిరిగా. 

మరోవైపు, నిత్యావసర వస్తువుల ధరలు  కూడా పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్ ధరలు, బియ్యం, కందిపప్పు, చింతపండు, వంటనూనె, పంచదార, గ్యాస్ ధరలు పెరిగిపోయాయి... ఇలా అన్నీ పెంచేసిన ఈ దుర్మార్గులను ఏంచేయాలి? ఇది కాకుండా రూ.12 లక్షల కోట్ల అప్పు తెచ్చాడు... జగన్ రెడ్డి రేపు జైలుకు పోతాడు... ఎవరు కడతారు ఈ అప్పు?" అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.


More Telugu News