రాజకీయాల నుంచి విరమించుకుంటున్నా.. వ్యాపారవేత్తలపై రాజకీయ వేధింపులు సరికాదు: లోక్ సభలో గల్లా జయదేవ్

  • ఎంపీగా తనకు అవకాశం కల్పించిన చంద్రబాబుకు కృతజ్ఞతగా ఉంటానన్న జయదేవ్
  • మోదీ పాలనలో భారత్ ఎంతో అభివృద్ధి చెందిందని ప్రశంస
  • కొన్నాళ్ల తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని వెల్లడి
తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని లోక్ సభలో మాట్లాడుతూ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. తనకు ఎంపీగా అవకాశం కల్పించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతగా ఉంటానని చెప్పారు. తనను పార్లమెంటుకు పంపిన గుంటూరు ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. సభలో ఎందరో పెద్దలు తనకు మార్గదర్శకంగా నిలిచారని చెప్పారు. 

ప్రధాని మోదీ ఎంతో విజన్ ఉన్న నాయకుడని జయదేవ్ ప్రశంసించారు. పదేళ్ల మోదీ పాలనలో భారత్ ఎంతో పురోగమించిందని అన్నారు. అయోధ్య రామాలయాన్ని కట్టించి, భారతీయుల శతాబ్దాల కలను మోదీ నిజం చేశారని చెప్పారు. 

ప్రజాస్వామ్య ప్రక్రియలో వ్యాపారులది కూడా కీలక పాత్ర అని... ఎంతో మంది వ్యాపారవేత్తలు చట్ట సభలకు ఎన్నికవుతున్నారని జయదేవ్ తెలిపారు. వ్యారవేత్తలపై రాజకీయ కక్షలు సరికాదని... వారిపై రాజకీయ వేధింపులను నివారించాలని కోరారు. దేశం, రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు పాత్రను పోషిస్తూనే ఉంటానని చెప్పారు. రాముడు 14 ఏళ్లు వనవాసం చేసినట్టు తాను కూడా రాజకీయాల్లో విరామం తీసుకుంటున్నానని... కొన్నాళ్ల తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. 

త్వరలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయని... స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జయదేవ్ అన్నారు. ఏపీలో దొంగ ఓట్లపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు మరింత బాధ్యతతో విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. అమరావతి రైతులకు ఇప్పటికీ తన మద్దతు ఉందని చెప్పారు. తన నియోజకవర్గ అభివృద్ధికి, అమరావతిని స్మార్ట్ సిటీగా నిలిపేందుకు కృషి చేశానని అన్నారు.


More Telugu News