ఝార్ఖండ్‌లో బలపరీక్షలో నెగ్గిన చంపయ్ సోరెన్ ప్రభుత్వం

  • మహాఘట్‌బంధన్‌కు అనుకూలంగా 47 ఓట్లు
  • బలపరీక్షకు వ్యతిరేకంగా 29 ఓట్లు
  • బలపరీక్షకు అనుకూలంగా జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్)
ఝార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం సోమవారం బలపరీక్షలో నెగ్గింది. బలపరీక్షలో చంపయ్ సోరెన్ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ ప్రభుత్వం 47 ఓట్లను సాధించింది. వ్యతిరేకంగా 29 ఓట్లు పోలయ్యాయి. బలపరీక్షకు వ్యతిరేకంగా ఓటు వేసిన పార్టీలలో బీజేపీ, ఏజేఎస్‌యూ ఉన్నాయి. బలపరీక్షకు అనుకూలంగా 29 మంది జేఎంఎం, 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) నుంచి ఒక్కో ఎమ్మెల్యే ఓటు వేశారు. మొత్తం 47 ఓట్లు అనుకూలంగా వచ్చాయి.

భూకుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. దీంతో హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం జేఎంఎం చంపయ్ సోరెన్‌ను పార్టీ శాసన సభా పక్ష నేతగా ఎన్నుకుంది. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో 81 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో చంపయ్ సోరెన్ మెజార్టీని నిరూపించుకోవాల్సి వచ్చింది.

బలపరీక్ష నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు హేమంత్ సోరెన్‌ను ఈడీ అసెంబ్లీకి తీసుకువచ్చింది. అలాగే, జేఎంఎం ఎమ్మెల్యేలను నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి రాంచీకి తరలించారు. బలపరీక్ష సమయంలో.... ముఖ్యమంత్రి చంపయ్ సోరెన్ ప్రతిపక్షంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర చేశారని ఆరోపించారు.


More Telugu News