0.45 సెకన్లలోనే క్యాచ్ అందుకున్న రోహిత్.. వీడియో ఇదిగో!

  • అశ్విన్ బౌలింగ్‌లో ఒల్లీ పోప్ అవుట్
  • స్లిప్‌లో ఉన్న రోహిత్ వైపు 0.45 సెక్షన్లలోనే దూసుకొచ్చిన బంతి
  • అద్భుతంగా ఒడిసిపట్టుకున్న రోహిత్
  • ప్రపంచంలోని బెస్ట్ స్లిప్ ఫీల్డర్లలో రోహిత్ ఒకడని దీనేశ్ కార్తీక్ కితాబు
విశాఖపట్టణంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఒల్లీపోప్ ఇచ్చిన క్యాచ్‌ను టీమిండియా సారథి రోహిత్ శర్మ నిన్న అందుకున్నప్పటి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. క్షణంలోని సగం కాలంలోనే తనవైపు దూసుకొచ్చిన క్యాచ్‌ను రోహిత్ అందుకున్న తీరు అదరహో అనిపించింది.

అశ్విన్ స్టంప్స్‌కు చాలా దగ్గరగా బంతిని సంధించాడు. అయినప్పటికీ బంతిని బాదేందుకే ప్రయత్నించిన పోప్ కట్‌షాట్ ఆడాడు. అయితే, బంతి తిరుగుతూ భుజం ఎత్తులో కీపర్ వెనకవైపునకు అత్యంత వేగంగా దూసుకెళ్లింది. అప్పటికే స్లిప్‌లో రెడీగా ఉన్న రోహిత్ బంతి కుడివైపునకు వస్తుందని భావించి పట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే, బంతి ఎడమవైపునకు టర్న్ కావడంతో క్షణంలోని వందోవంతులో స్పందించిన రోహిత్ గిరుక్కున తిరిగి బంతిని అందుకున్నాడు. 

క్యాచ్ మిస్సయినట్టేనని భావించిన అశ్విన్ అప్పటికే డీలా పడిపోగా, రోహిత్ అద్భుతమైన క్యాచ్‌కు ఫిదా అయిపోయి ఎగిరిగంతేశాడు. నిజానికి రోహిత్ స్పందించడం ఒక్క క్షణం ఆలస్యమైనా క్యాచ్ నేలపాలయ్యేదే. కామెంటరీ బాక్స్‌లో ఉన్న దినేశ్ కార్తీక్ ఈ క్యాచ్ గురించి చెబుతూ బంతి గాల్లో ఎగురుతూ రోహిత్ వైపు 0.45 సెకన్లలోనే దూసుకొచ్చిందని, హిట్‌‌మ్యాన్ అంతేవేగంగా స్పందించి పోప్‌ను పెవిలియన్ కు పంపించాడని చెప్పుకొచ్చాడు. ప్రపంచంలోని అత్యుత్తమ స్లిప్ ఫీల్డర్లలో రోహిత్ ఒకడని ప్రశంసించాడు.


More Telugu News