ఇక రెబల్ పాత్రలకి సైతం సై అంటున్న శరణ్య ప్రదీప్!
- 'ఫిదా'తో ఎంట్రీ ఇచ్చిన శరణ్య ప్రదీప్
- విలేజ్ నేపథ్యంలోని పాత్రలతో గుర్తింపు
- వెబ్ సిరీస్ లతోను ఆమె బిజీ
- సహజమైన నటనతో మెప్పిస్తున్న వైనం
- రెబల్ పాత్రలలోను రాణించే అవకాశం
శరణ్య ప్రదీప్ తెలంగాణ యువతి .. చిన్న చిన్న పాత్రలతోనే మంచి గుర్తింపు తెచ్చుకుని, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న ఆర్టిస్ట్. తెలంగాణ యాస మాట్లాడటంలో ఆమె కంటూ ఒక స్టైల్ ఉంది .. అందువలన పల్లె పాత్రలలో ఆమె ఇట్టే ఒదిగిపోతుంది. శరణ్య ప్రదీప్ కనుముక్కుతీరు బాగుంటుంది. ఆమె కళ్లలోని మెరుపు .. డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటాయి. ఆమె నటనలో సహజత్వం మెప్పిస్తుంది. 'ఫిదా' సినిమాలో సాయిపల్లవి నటన ముందు తేలిపోకుండా, తొలి సినిమాతోనే ఆమె నిలదొక్కుకుంది. ఆడియన్స్ దృష్టిని తనవైపుకు తిప్పుకోగలిగింది. ఎవరా ఈ అమ్మాయి అని సెర్చ్ చేసే స్థాయిలో ప్రభావితం చేసింది. ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూనే, అడపాదడపా వెబ్ సిరీస్ లలోను మెరుస్తోంది. త్వరలో 'ఆహా' ద్వారా పలకరించనున్న 'భామాకలాపం 2'లో ఆమె ముఖ్యమైన పాత్రను పోషించింది. ప్రియమణితో పాటు సమానంగా స్క్రీన్ పై కనిపించే 'శిల్ప' పాత్ర అది. ఇక రీసెంటుగా థియేటర్స్ కి వచ్చిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' సినిమాలో శరణ్య ప్రదీప్ ఒక కీలకమైన పాత్రను పోషించింది. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో ఆమె హీరో కంటే ఎక్కువ పవర్ఫుల్ గా అనిపించే పాత్రను పోషించింది. విలన్ ను సైతం ధైర్యంగా ఎదుర్కునే పాత్ర ఇది. ఈ సినిమాకి వెళ్లిన ప్రేక్షకుల నుంచి ఆమె పాత్ర ఎక్కువ ప్రశంసలను అందుకుంటుంది. శరణ్య ప్రదీప్ సాఫ్ట్ రోల్స్ మాత్రమే కాదు, రెబల్ రోల్స్ ను కూడా పోషించగలదు అని నిరూపించిన పాత్ర ఇది. ఇకపై ఆమె మరింత బిజీ అయినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.