ప్రముఖ ఐటీ కంపెనీపై 5 వేల మంది ఉద్యోగుల తిరుగుబాటు!

  • వారానికి 3 రోజులు ఆఫీసుకు రావాలన్న ఐరోపా కంపెనీ ఎస్ఏపీ 
  • సంస్థ ఆదేశాలపై ఉద్యోగుల్లో ఆగ్రహం
  • గతంలో ‘వర్క్ ఫ్రం హోం’ను ప్రోత్సహించి ఇప్పుడు కుదరదనడం మోసమేనంటూ గగ్గోలు
  • ఉద్యోగాలకు రాజీనామా చేస్తామంటూ హెచ్చరికలు
‘వర్క్ ఫ్రం హోం’ విధానానికి ముగింపు పలుకుతున్న టెక్ కంపెనీలపై ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఐరోపాలోని అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థలలో ఒకటైన ఎస్ఏపీ (SAP)పై తాజాగా 5 వేల మంది ఉద్యోగులు తిరుగుబాటు ప్రకటించారు. ఆఫీసుకు రమ్మని బలవంతం చేస్తే మరో జాబ్ చూసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు. 

‘‘మమ్మల్ని కంపెనీ మోసం చేసింది. ఇంతకాలం వర్క్ ఫ్రం హోంను ప్రోత్సహించిన కంపెనీ అకస్మాత్తుగా ఆఫీసులకు రమ్మంటూ ప్లేటు ఫిరాయించింది’’ అని ఉద్యోగులు కంపెనీ అంతర్గత లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది. వర్క్ ఫ్రం హోం కొనసాగించొచ్చని చెప్పిన కంపెనీ ఇప్పుడు మళ్లీ ఆఫీసులకు రమ్మనడం సహేతుకం కాదని ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూరోపియన్ వర్క్ కౌన్సిల్ పేర్కొంది. 

వర్క్ ఫ్రం హోంకు సంబంధించి జనవరిలో ఎస్ఏపీ కొత్త విధానాన్ని ప్రకటించింది. దీని ప్రకారం, ఏప్రిల్ నుంచి ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకు రావాలి. లేదా, కస్టమర్లతో ఆన్‌సైట్‌లో వారానికి మూడు రోజుల పాటు పనిచేయాలి. 

మరోవైపు, వర్క్ కౌన్సిల్ తీరును సంస్థ సీఈఓ కార్యాలయం ఖండించింది. వర్క్ ఫ్రం హోం విధానంతో సంస్థలో పని సంస్కృతి, టీంవర్క్ దెబ్బతింటాయని పేర్కొంది. 

వర్క్ ఫ్రమ్ హోం, వర్క్ ఫ్రం ఆఫీస్ విధానాల మధ్య సమతౌల్యం పాటించడంతోనే ఉద్యోగుల ఉత్పాదకత పెరుగుతుందని ఎస్ఏపీ అభిప్రాయపడింది. తద్వారా, సృజనాత్మకత కూడా పెరుగుతుందని పేర్కొంది. మార్కెట్ ప్రమాణాలను అనుసరించి ఫ్లెక్సిబుల్ వర్క్ విధానాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించింది. 

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక టెక్ కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని ఒత్తిడి పెంచేశాయి. కంపెనీల ఆదేశాలను ధిక్కరిస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం కూడా ప్రారంభించాయి. వర్క్ ఫ్రం హోం ఉద్యోగుల కెరీర్‌లో పురోగతి కుంటుపడుతుందని హెచ్చరిస్తున్నాయి. ఇంట్లోంచే పనిచేస్తామనే వాళ్లు మరో జాబ్ చూసుకోవడం మంచిదని కూడా కొన్ని కంపెనీలు తేల్చి చెబుతున్నాయి.


More Telugu News