ప్రపంచంలో అత్యంత ట్రాఫిక్ ఉండే నగరం ఇదేనట!

  • టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్-2023లో విడుదల
  • నెంబర్ వన్ గా లండన్
  • లండన్ లో 10 కి.మీ వెళ్లాలంటే 37 నిమిషాల సమయం
  • టాప్-10లో బెంగళూరు, పూణే 
టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్-2023 లో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ప్రపంచంలో అత్యంత అధికంగా ట్రాఫిక్ ఉండే నగరంగా లండన్ సిటీ నిలిచింది. బ్రిటన్ లోని లండన్ మహానగరంలో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే సగటున 37 నిమిషాల సమయం పడుతుందని ట్రాఫిక్ ఇండెక్స్ లో పేర్కొన్నారు. ఇక్కడ వాహనాల సగటు వేగం గంటకు 14 కిలోమీటర్లు. 

అత్యధిక ట్రాఫిక్ ఉండే టాప్-10 నగరాల్లో బెంగళూరు 6వ స్థానంలో, పూణే 7వ స్థానంలో ఉన్నాయి. బెంగళూరులో 10 కిలోమీటర్ల ప్రయాణానికి సగటున 28.10 నిమిషాల సమయం పడుతుందని, పూణేలో 10 కిలోమీటర్ల ప్రయాణానికి 27.50 నిమిషాల సమయం పడుతుందని వివరించింది. బెంగళూరులో వాహనాల సగటు వేగం గంటకు 18 కిలోమీటర్లు కాగా, పూణేలో వాహనాల సగటు వేగం గంటకు 19 కిలోమీటర్లు. 

ఇక ఈ జాబితాలో ఢిల్లీ 44, ముంబయి 54వ స్థానంలో ఉన్నాయి. మొత్తం 55 దేశాల్లోని 387 నగరాల్లో ఇన్ కార్ నేవిగేషన్ వ్యవస్థలు, స్మార్ట్ ఫోన్ ఆధారిత సమాచారాన్ని విశ్లేషించి టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ రూపొందించారు.


More Telugu News