ఉద్యోగినికి సీఈఓ లైంగిక వేధింపులు..నిందితుడిపై కేసు నమోదు

  • హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో హెచ్ఆర్, లీగల్ విభాగంలో యువతి విధులు
  • జూమ్ మీటింగ్‌లల్లో యువతితో సీఈఓ అసభ్యకర మాటలు
  • యువతిని రెస్టారెంట్‌కు పిలిపించి కోరిక తీర్చాలని డిమాండ్
  • రాజీనామా చేసినా వేధింపులు కొనసాగడంతో పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు
తన కంపెనీలోని ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఓ సీఈఓపై హైదరాబాద్ పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి అమీర్‌పేట్‌లోని కంపెనీలో హెచ్‌ఆర్, లీగల్ మేనేజర్‌గా పనిచేస్తోంది. ఆ కంపెనీ సీఈఓ తొండెపు చంద్ర అమెరికాలో ఉంటున్నాడు. తరచూ జరిగే జూమ్ మీటింగుల సందర్భంగా సీఈఓ ఆమెతో అసభ్యంగా మాట్లాడేవాడు. 

గతేడాది డిసెంబర్ 22న అమెరికా నుంచి వచ్చిన చంద్ర 23న అమీర్‌పేట్‌లోని కార్యాలయంలో మీటింగ్‌లో మళ్లీ ఆమెను వేధించాడు. జనవరి 2న నెక్లెస్ రోడ్డులోని ఓ రెస్టారెంట్‌కు రప్పించి తన కోరిక తీర్చాలని డిమాండ్ చేయగా ఆమె నిరాకరించింది. చివరకు తాను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు ఈమెయిల్‌ పంపించింది. జీతంతో పాటూ ఇతర పత్రాలు ఇవ్వాలని కోరింది. ఇందుకు నిరాకరించిన చంద్ర మళ్లీ వేధింపులకు దిగడంతో యువతి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


More Telugu News