చంద్రబాబు 'రా కదలి రా' నినాదంపై సీఎం జగన్ సెటైర్లు

  • దెందులూరులో సిద్ధం సభ
  • విపక్షాలపై సీఎం జగన్ విమర్శనాస్త్రాలు 
  • చంద్రబాబు రా కదలి రా అంటూ పార్టీలను పిలుస్తున్నాడని ఎద్దేవా
  • చంద్రముఖి ఇంటింటికీ వస్తుందని వ్యంగ్యం 
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు 'రా కదలి రా' నినాదంపై సీఎం జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇవాళ సీఎం జగన్ దెందులూరులో నిర్వహించిన సిద్ధం సభలో ప్రసంగిస్తూ... చంద్రబాబు 'రా కదలి రా' అంటూ ప్రజలను కాదని, పార్టీలను పిలుస్తున్నాడని విమర్శించారు. ప్యాకేజి కోసం రమ్మని దత్తపుత్రుడ్ని పిలుస్తున్నాడు... మరో పార్టీలో ఉన్న వదినమ్మను కూడా పిలుస్తున్నాడు అని ఎద్దేవా చేశారు. సైకిల్ ను తోయడానికి ఇద్దరిని, సైకిల్ తొక్కడానికి మరో ఇద్దరిని తెచ్చుకున్నాడు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 

"చంద్రబాబు అండ్ గ్యాంగ్ తో యుద్ధం అంటే నాకు కొత్త  కాదు. గత 15 ఏళ్లుగా నాకు అలవాటే. నాతో నడుస్తున్నందుకు మీకు కూడా అలవాటై  ఉంటుంది. చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఏమీ ఉండదు కాబట్టే, ఎన్నికలప్పుడు ఎన్టీఆర్ గుర్తొస్తాడు. 

ఇవాళ నాలుగు ఓట్లు విడదీసేందుకు ద్రోహులను రమ్మంటున్నాడు... బాబుకు, దత్తపుత్రుడికి, వదినమ్మకు ఏమిటి సంబంధం? వీళ్లు నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్, వీళ్లు నాన్ లోకల్. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే వీళ్లకు ప్రజలతో పనిబడింది... ప్రజలతో పనిబడింది కాబట్టే వీళ్లకు రాష్ట్రం గుర్తుకువస్తుంది. 

పొత్తు లేకుండా చంద్రబాబు 175 స్థానాల్లో పోటీ చేయగలరా? వాళ్ల పార్టీకి 175 స్థానాల్లో అభ్యర్థులు ఉన్నారా? ఇలాంటి దిగజారిన పార్టీలు మీ బిడ్డను టార్గెట్ చేశాయి. 

గత ఎన్నికల్లో మీరు ఓటు అనే ఆయుధంతో పెట్టెలో పెట్టి బంధించిన చంద్రముఖి మళ్లీ వస్తోంది. సైకిల్ ఎక్కి, టీ గ్లాసు పట్టుకుని పేదల రక్తం తాగేందుకు లక లక లక లక అంటూ ప్రతి ఇంటికీ వస్తుంది. అబద్ధపు హామీలు, మోసపూరిత వాగ్దానాలతో ఓ డ్రాక్యులా మాదిరి ప్రతి ఇంటి తలుపు తట్టి, ప్రజల రక్తం తాగుతుంది. 

ఈసారి ఎన్నికల్లోనూ మీ ఓటు జగనన్నకే వేయండి... ఆ చంద్రముఖి బెడద శాశ్వతంగా తొలగిపోతుంది... చంద్రగ్రహణాలు కూడా ఉండవు" అంటూ సీఎం జగన్ పిలుపునిచ్చారు.


More Telugu News