నోటీసులు ఇచ్చేందుకు.. కేజ్రీవాల్ ఇంటికి ఢిల్లీ పోలీసులు

  • ఆప్ ఎమ్మెల్యేలకు డబ్బు ఆఫర్ పై నోటీసుల జారీ
  • నోటీసులు తీసుకునేందుకు సీఎం నివాసం వద్ద భద్రతా సిబ్బంది విముఖత
  • మంత్రి అతిశీకి కూడా నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులు
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ కు నోటీసులు అందజేసేందుకు క్రైంబ్రాంచ్ పోలీసులు శనివారం ఆయన నివాసానికి వెళ్లారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆయన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ కేజ్రీవాల్ కు ఈ నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలకు సంబంధించి ఆధారాలను అందించాలని ఈ నోటీసులలో పేర్కొన్నారు. 

అయితే, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అధికారిక నివాసం వద్ద ఉన్న భద్రతా సిబ్బంది ఈ నోటీసులను తీసుకునేందుకు విముఖత చూపినట్లు తెలుస్తోంది. దీంతో నేరుగా ముఖ్యమంత్రిని కలిసి ఆయనకే అందజేయాలని పోలీసులు వేచి చూస్తున్నారు. ఇవే ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ మంత్రి అతిశీకి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసులతో అతిశీ నివాసానికి వెళ్లిన పోలీసులు.. మంత్రి ఇంట్లో లేకపోవడంతో వెనక్కి వెళ్లిపోయినట్లు సమాచారం.

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఒక్కొక్కరికీ రూ.25 కోట్లు ఆఫర్ చేసిందని ఇటీవల కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శలు గుప్పించారు. దీనిపై బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్ ఆరోపణలు చాలా తీవ్రమైనవని, ఈ ఆరోపణలకు సంబంధించి నిజాలు నిగ్గుతేల్చాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాను ఆశ్రయించారు.

ఈ సందర్భంగా కేజ్రీవాల్ పై సచ్ దేవా మండిపడ్డారు. నోటికి వచ్చిన ఆరోపణలు చేయడం, విచారణ నుంచి తప్పించుకునేందుకు సాకులు వెతకడం కేజ్రీవాల్ కు అలవాటుగా మారిందని ఆరోపించారు. కేజ్రీవాల్ చేసిన, చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనని తాజా ఘటనతో నిర్ధారణ అయ్యిందన్నారు. వీరేంద్ర సచ్ దేవా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బీజేపీపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలను అందించాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేశారు.


More Telugu News