టీమిండియా ఆలౌట్.. యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ

  • విశాఖలో టీమిండియా - ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు
  • తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగులకు ఆలౌట్ అయిన భారత్
  • 209 పరుగులతో జైస్వాల్ సంచలన ఇన్నింగ్స్
విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా యువ బ్యాట్స్ మెన్ యశస్వి జైశ్వాల్ డబుల్ సెంచరీతో మెరిశాడు. ఓవర్ నైట్ స్కోరు 179 పరుగులతో ఈరోజు బ్యాటింగ్ ప్రారంభించిన జైస్వాల్ ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ, భారీ షాట్లు కొడుతూ డబుల్ సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. 277 బంతుల్లో ద్విశతకాన్ని పూర్తి చేశాడు. చివరకు 209 పరుగులకు ఔటయ్యాడు. 7 సిక్సర్లు, 19 ఫోర్లతో ఈ స్కోరును సాధించాడు. 

మరోవైపు, తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 396 పరుగులకు ఆలౌట్ అయింది. ఇండియన్ బ్యాట్స్ మెన్లలో మరెవరూ రాణించలేకపోయారు. శుభ్ మన్ గిల్ సాధించిన 34 పరుగులే సెకండ్ హయ్యెస్ట్ స్కోరు కావడం గమనార్హం. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్, షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ లు చెరో మూడు వికెట్లను సాధించగా... టామ్ హార్ట్లీ ఒక వికెట్ తీశాడు. ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ను ప్రారంభించింది. ఓపెనర్లు జాక్ క్రాలీ 11, బెన్ డకెట్ 13 పరుగులో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోరు వికెట్ నష్టపోకుండా 24 పరుగులు. 

ఇంకోవైపు, జైస్వాల్ అరుదైన ఘనతను సాధించాడు. అతి పిన్న వయసులోనే డబుల్ సెంచరీ చేసిన మూడో భారత బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. జైస్వాల్ 22 ఏళ్ల 37 రోజుల వయసులో ఈ ఘనతను సాధించాడు. ఆయన కంటే ముందు వినోద్ కాంబ్లీ (21 ఏళ్ల 35 రోజులు), సునీల్ గవాస్కర్ (21 ఏళ్ల 283 రోజులు) ఉన్నారు.


More Telugu News