భారీగా పెరిగిన మెటా షేర్లు.. అత్యధిక సంపద వృద్ధి నమోదు చేసిన మార్క్‌ జుకర్‌బర్గ్

  • ఈ ఏడాది ఇప్పటివరకూ మార్క్ జుకర్‌బర్గ్ నికర సంపదలో 14.3 బిలియన్ డాలర్ల వృద్ధి
  • ప్రపంచంలో ఐదో అత్యంత ధనవంతుడిగా నిలిచిన మెటా అధినేత
  • మెటా షేర్ల విలువ పెరగడంతో మార్క్ సంపదలో వృద్ధి
ప్రముఖ టెక్ సంస్థ మెటా షేర్లు ఇటీవల భారీగా పెరగడంతో సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ సంపద బాగా వృద్ధి చెందింది. ఈ సంవత్సరం ఇప్పటివరకూ అత్యధిక సంపద వృద్ధి చవిచూసిన వ్యక్తిగా ఆయన నిలిచారు. ప్రపంచ అపరకుబేరుల జాబితాలో ఐదో స్థానం దక్కించుకున్నారు. ఈ సంవత్సరం ఇప్పటివరకూ మార్క్ నికర సంపద విలువ 14.3 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. మార్క్‌కు మెటాలో 13 శాతం వాటా ఉన్న విషయం తెలిసిందే. 

మెటా షేర్ల విలువ పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మార్క్ నికర సంపద విలువ మరింత పెరుగుతుందని ప్రముఖ మార్కెట్ విశ్లేషణ సంస్థ మార్కెట్‌వాచ్ పేర్కొంది. గురువారం పోస్ట్ మార్కెట్ ట్రేడింగ్‌లో మెటా షేర్ల విలువ ఏకంగా 15 శాతం పెరిగింది. మెటా డివిడెండ్ల ఆర్జనను బహిర్గతం చేస్తానన్న మార్క్ నిర్ణయంతో షేర్లకు కొత్త ఊపు వచ్చింది. దీంతో, సంస్థ మార్కెట్ విలువ కూడా 140 బిలియన్ డాలర్ల మేర పెరిగి 1.17 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మెటా షేర్ల విలువ 109 శాతం పెరిగింది. 2012లో మెటా ఐపీఓ నాటి విలువతో పోలిస్తే ఇది 933 శాతం అధికం. ఇక ఫేస్‌బుక్ మాతృసంస్థకు 2021 అక్టోబర్‌లో మెటాగా నామకరణం చేసిన విషయం తెలిసిందే.


More Telugu News