పరువునష్టం కేసులో బాలీవుడ్ నటి కంగనకు కోర్టులో చుక్కెదురు

  • జావెద్ అక్తర్ తనను ఇంటికి పిలిచి నేరపూరితంగా బెదిరించాంటూ కంగన ఆరోపణ
  • 2020లో పరువునష్టం కేసు దాఖలు చేసిన జావెద్ అక్తర్
  • క్రాస్ కంప్లైంట్‌ను కూడా క్లబ్ చేయాలన్న కంగన అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం
బాలీవుడ్ సినీ గేయ రచయిత జావెద్ అక్తర్‌ తనపై వేసిన పరువు నష్టం కేసులో సినీ నటి కంగన రనౌత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. విచారణపై స్టే ఇవ్వాలన్న ఆమె పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. క్రాస్ కేసులను కూడా వీటితో కలపాలంటూ ఆమె చేసిన అభ్యర్థనను కూడా కోర్టు తిరస్కరించింది. కంగన ఎప్పుడూ వాటిని క్రాస్ కేసులని చెప్పనందున ప్రొసీడింగ్‌లను నిలివేయడం, లేదంటే క్లబ్ చేయడం సాధ్యం కాదని న్యాయమూర్తి జస్టిస్ ప్రకాశ్ నాయక్ స్పష్టం చేశారు. జావెద్ అక్తర్ ఫిర్యాదు తొలుత దాఖలు చేశారని, కాబట్టి ఈ దశలో ఊరట కల్పించలేమని పేర్కొన్నారు. ఆ రెండు కేసులూ క్రాస్ కేసులేనని పిటిషనర్ (కంగన) గతంలో ఎప్పుడూ పేర్కొనలేదని తెలిపారు. 

హృతిక్ రోషన్‌తో అఫైర్‌ విషయంలో గొడవ తర్వాత జావెద్ అక్తర్ తనను, తన సోదరి రంగోలీని తన ఇంటికి పిలిచి దుర్భాషలాడుతూ నేరపూరితంగా బెదిరించాడంటూ ఓ ఇంటర్వ్యూలో కంగన ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ 2020లో జావెద్ కోర్టుకెక్కారు. ఆ తర్వాత జావెద్‌ ఫిర్యాదుపై కంగన కౌంటర్ ఫిర్యాదు దాఖలు చేశారు. కంగనపై జావెద్ దాఖలు చేసిన పరువునష్టం కేసు అంధేరీలోని మేజిస్ట్రేట్ ముందు కొనసాగుతుండగా ఆయనపై కంగన దాఖలు చేసిన ఫిర్యాదుపై సెషన్స్ కోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో తాజాగా బాంబే హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.


More Telugu News