దేశ ఎన్నికల్లో భారత్ జోక్యం నిజమే: కెనడా నిఘా సంస్థ తాజా నివేదిక

  •  
  • భారత్‌తో పాటూ చైనా పేరునూ తన నివేదికలో ప్రస్తావించిన వైనం
  • చైనాను అతిపెద్ద విదేశీ ముప్పుగా పేర్కొన్న కెనడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ
  • రష్యాపై కూడా ఇదే తరహా ఆరోపణలు
కెనడా అత్యున్నత విదేశీ వ్యవహారాల నిఘా సంస్థ కెనేడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ భారత్‌పై సంచలన ఆరోపణలు చేసింది. కెనడా ఎన్నికల్లో భారత్‌ జోక్యం చేసుకున్నట్టు తన తాజా నివేదికలో పేర్కొంది. భారత్‌తో ముప్పు పొంచి ఉందని కూడా హెచ్చరించింది. గతేడాది విడుదలైన ఈ నివేదిక వివరాలను స్థానిక మీడియా తొలిసారిగా బహిర్గతం చేసింది. భారత్‌తో పాటూ చైనా, రష్యాపై కూడా కెనడా నిఘా సంస్థ ఇవే తరహా ఆరోపణలు చేసింది. కెనడా నిఘా నివేదికలో భారత్‌ పేరును నేరుగా ప్రస్తావించడం కూడా ఇదే తొలిసారి కావడంతో ఈ పరిణామం కలకలం రేపుతోంది. 

కెనడా రాజకీయాలు, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో భారత్ జోక్యాన్ని అడ్డుకోకబోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని కూడా నిఘా వర్గాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఈ నివేదిక ఆధారంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో లోతైన దర్యాప్తునకు ఆదేశించారు. 

మరోవైపు, చైనా జోక్యంపై నిఘా వర్గాలు మరింత ఆందోళన వ్యక్తం చేశాయి. చైనాను అతిపెద్ద విదేశీ ముప్పుగా వర్ణించాయి. కెనడా రాజకీయాల్లో చైనా కార్యకలాపాల విస్తృతి, వినియోగిస్తున్న వనరుల దృష్ట్యా కమ్యునిస్టు దేశం తీరు ఆందోళనకరమని అభిప్రాయపడ్డాయి. కెనడాలోని అన్ని రంగాలు, అన్ని స్థాయుల్లో చైనా జోక్యం పెరిగిపోయిందని పేర్కొన్నాయి. ఈ నిఘా నివేదికలో భారత్‌తో పాటూ చైనా పేరును కూడా నేరుగా ప్రస్తావించాయి.


More Telugu News