తమిళనాడు ప్రజలకు క్షమాపణలు తెలిపిన యువ హీరోయిన్

  • ఇటీవల లాల్ సలామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ధన్య బాలకృష్ణన్ వ్యాఖ్యలు చేసినట్టుగా ఓ స్క్రీన్ షాట్ వైరల్
  • అది 12 ఏళ్ల నాటి స్క్రీన్ షాట్ అని ధన్య వెల్లడి
  • అందులోని వ్యాఖ్యలు తనవి కావని స్పష్టీకరణ
యువ నటి ధన్య బాలకృష్ణన్ పలు చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. అయితే, రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరగ్గా... ఆ కార్యక్రమం అనంతరం ధన్య బాలకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆమె తమిళనాడు ప్రజలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఓ స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది. 

ఈ నేపథ్యంలో, ధన్య బాలకృష్ణన్ స్పందించారు. ఆ స్క్రీన్ షాట్ లో ఉన్న వ్యాఖ్యలకు, తనకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని, ఎవరో ఎడిట్ చేసి స్క్రీన్ షాట్ ను వైరల్ చేస్తున్నారని వివరించారు. 

"నాకు తిండి పెడుతోంది సినీ పరిశ్రమే. ఆ పరిశ్రమ మీద ఒట్టేసి చెబుతున్నాను. నన్ను ఇబ్బందులకు గురిచేయడానికే కొందరు ఆ స్క్రీన్ షాట్ ను క్రియేట్ చేశారు. అది ఇప్పటిది కాదు... 12 ఏళ్ల నాటిది. అయితే నా కుటుంబానికి బెదిరింపులు రావడంతో దానిపై ఇన్నాళ్ల పాటు మౌనంగా ఉన్నాను. నా వాళ్లను కాపాడుకోవడానికే దానిపై నోరు విప్పలేదు. 

నాకు జీవితాన్ని ఇచ్చిందే తమిళ సినీ పరిశ్రమ. అలాంటప్పుడు తమిళనాడు గురించి ఎందుకు తప్పుగా మాట్లాడతాను? ఆ పోస్టులో ఉన్నది నా మాటలు  కాదని మరోసారి స్పష్టం చేస్తున్నాను... అయినప్పటికీ, ఆ స్క్రీన్ షాట్ వల్ల తమిళ ప్రజలు బాధపడి ఉంటే, వారికి నేను క్షమాపణలు చెబుతున్నా" అని ధన్య బాలకృష్ణన్ వివరించారు. 

అంతేకాదు, రజనీకాంత్ కు , లాల్ సలామ్ దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ కు కూడా ఆమె క్షమాపణలు చెప్పారు. అయితే, ఆ స్క్రీన్ షాట్ లోని వ్యాఖ్యలు తాను చేయలేదని నిరూపించుకునే ఆధారాలు తన వద్ద లేవని ఆమె నిస్సహాయత వ్యక్తం చేశారు.


More Telugu News