కాంగ్రెస్‌కు దమ్ముంటే బీజేపీని వారణాసి సహా ఆ రాష్ట్రాల్లో ఓడించాలి: మమతా బెనర్జీ సవాల్

  • బెంగాల్లో 2 సీట్లు ఇస్తామని ఆఫర్ చేస్తే మరిన్ని సీట్లు అడిగారని మమతా బెనర్జీ ఆగ్రహం
  • కాంగ్రెస్ దేశవ్యాప్తంగా 40 సీట్లు గెలుస్తుందో లేదోనని అనుమానం వ్యక్తం చేసిన దీదీ
  • యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో బీజేపీని ఓడించగలరా? అని కాంగ్రెస్‌కు సవాల్
కాంగ్రెస్ పార్టీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు గెలవడం కూడా కష్టమే అని అనుమానం వ్యక్తం చేశారు. ఆ పార్టీకి దమ్ముంటే వారణాసిలో బీజేపీపై గెలవాలని సవాల్ చేశారు. బెంగాల్లో మొత్తం 42 లోక్ సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని మమత నిర్ణయించారు. తాజాగా ఆమె ఏఎన్ఐతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్ కనీసం 40 సీట్లు గెలుస్తుందో లేదో అనే అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు. 'బెంగాల్లో నేను రెండు సీట్లు ఆఫర్ చేస్తున్నాను... వాటిలో గెలవండి' అని సవాల్ చేశారు. ఆ రెండు స్థానాల్లో గెలవలేని వారు ఎక్కువ సీట్లు కోరుకున్నారని, అందుకే బెంగాల్లోని మొత్తం 42 స్థానాల్లోనూ పోటీ చేయమని తాను కాంగ్రెస్‌కు ఆఫర్ చేశానని.. కానీ వారు తిరస్కరించారన్నారు. నాటి నుంచి వారితో సీట్ల విషయమై ఎలాంటి చర్చలు జరపలేదన్నారు.

నాకు రాహుల్ యాత్రపై సమాచారం ఇవ్వలేదు

బెంగాల్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై తనకు సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. తాను ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ తనకు చెప్పలేదన్నారు. తనకు అధికారుల ద్వారా తెలిసిందన్నారు.

బీజేపీని ఆ రాష్ట్రాల్లో ఓడించండి

కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీని ఓడించాలని మమతా బెనర్జీ సవాల్ చేశారు. వారణాసిలో బీజేపీని ఓడించే సత్తా ఉందా? అని ప్రశ్నించారు. మరోవైపు... రాష్ట్రంలో కమ్యూనిస్టుల పాలనలో తమ పార్టీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని ఆరోపిస్తూ.... వారితో పొత్తును మమతా బెనర్జీ తోసిపుచ్చారు.


More Telugu News