కాంగ్రెస్ గెలవలేదు.. బీఆర్ఎస్ పార్టీనే ఓడిపోయింది: కిషన్ రెడ్డి

  • కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న కిషన్ రెడ్డి
  • యువతను మోసం చేస్తోందని మండిపాటు
  • హామీలను వ్యూహాత్మకంగా దాటవేసే ప్రయత్నం చేస్తోందని విమర్శ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదని... బీఆర్ఎస్ పార్టీనే ఓడిపోయిందని కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పై కోపంతోనే ప్రజలు కాంగ్రెస్ ను ఎన్నుకున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారం సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి గురించి రేవంత్ మాట్లాడారని... కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వీరిపై చర్యలు తీసుకుంటామని చెప్పారని... కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినంత మాత్రాన పాలనలో తేడా ఉంటుందని తాను అనుకోవడం లేదని అన్నారు. 

యువతను కాంగ్రెస్ మోసం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల హామీలను వ్యూహాత్మకంగా దాటవేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంటోందని అన్నారు. రాష్ట్రంలో అధికారంలో బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా ఉపయోగం లేదని చెప్పారు. కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని... లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News