పెద్దసారు ఉన్నప్పుడు నేను ఎక్కువగా మాట్లాడను: మాజీ మంత్రి మల్లారెడ్డి

  • ఈ ప్రాంతం నుంచే ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానన్న మల్లారెడ్డి
  • కేసీఆర్, ప్రజల ఆశీర్వాదంతో తాను విజయం సాధించానని వెల్లడి
  • తాను మంత్రినయ్యాక స్థానిక సంస్థల ఎన్నికల్లో 95 శాతం విజయాలు బీఆర్ఎస్‌వేనని వ్యాఖ్య
తాను మంత్రినయ్యాక మేడ్చల్ నియోజకవర్గంలో అన్నింటా 95 శాతం గెలుపు బీఆర్ఎస్‌దేనని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. కేటీఆర్‌ను పెద్దన్న అంటూ ఆయన పేర్కొన్నారు. 'మామూలుగా పెద్దసారు (కేసీఆర్) ఉన్నప్పుడు నేను ఎక్కువగా మాట్లాడను. అయితే ఓసారి మాత్రం మా పెద్దసారు ఉన్నప్పుడు నేను కూడా ఎక్కువగా మాట్లాడా'నని నవ్వుతూ అన్నారు. శుక్రవారం ఘట్‌కేసర్‌లో నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మేడ్చల్ అని... ఈ నియోజకవర్గంలో మూడు కార్పోరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 61 గ్రామ పంచాయతీలు ఉన్నాయని గుర్తు చేశారు.

తాను ఈ ప్రాంతం నుంచి ఎంపీని అయ్యానని... ఆ తర్వాత ఎమ్మెల్యేను అయ్యానని.. కేసీఆర్ ఆశీర్వాదంతో మంత్రిని కూడా అయ్యానని గుర్తు చేసుకున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. తాను మంత్రిని అయినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుస్తూ వస్తోందన్నారు. తన హయాంలో ఏడు మున్సిపాలిటీలను, మూడు కార్పోరేషన్లను గెలుచుకున్నామని గుర్తు చేశారు.

నాలుగు జిల్లా పరిషత్ చైర్మన్లను, 44కు గాను 40 ఎంపీటీసీలను, 61కి గాను 55 సర్పంచ్‌లను, 210 కార్పోరేటర్లకు గాను 190 మందిని గెలిపించుకున్నట్లు తెలిపారు. తాను మంత్రిని అయ్యాక గెలుపు శాతం 95గా ఉందని... నియోజకవర్గంలో ఎక్కడ చూసినా బీఆర్ఎస్... కేసీఆర్.. పేరు వినిపిస్తోందన్నారు. నియోజకవర్గమంతా బీఆర్ఎస్ పేరు వినిపించేలా అభివృద్ధి చేశానని పేర్కొన్నారు. కరోనా సమయంలో పేద ప్రజలను ఆదుకున్నామన్నారు.


More Telugu News