దురదృష్టవశాత్తు గత నాలుగున్నరేళ్లుగా ఏపీ పేరు అభివృద్ధిలో కంటే డ్రగ్స్ లోనే ఎక్కువగా వినిపిస్తోంది: చంద్రబాబు

  • హైదరాబాదులో యాంటీ డ్రగ్ ఆపరేషన్
  • ఇద్దరు ఏపీ పోలీసుల అరెస్ట్
  • 22 కిలోల గంజాయి స్వాధీనం
  • రాష్ట్రానికి తలవంపులు తెచ్చే ఘటన అంటూ చంద్రబాబు విమర్శలు
  • జగన్ రెడ్డి నుంచి స్ఫూర్తి పొంది ఉంటారని బుద్ధా వెంకన్న వ్యంగ్యం
హైదరాబాదులో ఇద్దరు ఏపీ పోలీసులు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. దురదృష్టవశాత్తు గత నాలుగున్నరేళ్లుగా ఏపీ పేరు అభివృద్ధిలో కంటే డ్రగ్స్ విషయంలోనే ఎక్కువగా వినిపిస్తోందని పేర్కొన్నారు. 

తాజాగా కాకినాడకు చెందిన ఇద్దరు పోలీసులు హైదరాబాదులో అరెస్ట్ కావడం తీవ్ర ఆందోళనకర అంశమని, రాష్ట్రానికి తలవంపులు తెచ్చే ఘటన అని విమర్శించారు. 

"ఈ విచారకరమైన ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, వైసీపీ ప్రభుత్వం ఒక కీలకమైన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఈ రాకెట్ వెనుక ఉన్న సూత్రధారి ఎవరు... ఎవరెవరు నేతలు ఇందులో ఉన్నారు?" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. 

దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలోనే!: బుద్ధా వెంకన్న

హైదరాబాదులో నిర్వహించిన యాంటీ డ్రగ్ ఆపరేషన్ లో ఇద్దరు ఏపీ పోలీసులు పట్టుబడడంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుద్ధా వెంకన్న కూడా స్పందించారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలో తేలాల్సిందేనని విమర్శించారు. 

"హైదరాబాదులోని బాచుపల్లిలో 22 కేజీల గంజాయిని తీసుకెళుతున్న వాహనాన్ని పట్టుకున్నారు. ఆరా తీస్తే కాకినాడలో పనిచేస్తున్న ఒక హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ సిక్ లీవు పెట్టి మరీ ఈ దందాను నడిపిస్తున్నారని తేలింది. జగన్ రెడ్డి నుంచి స్ఫూర్తి పొంది ఉంటారు" అంటూ బుద్ధా వెంకన్న వ్యంగ్యం ప్రదర్శించారు.


More Telugu News