మాల్దీవుల ఆర్థిక సాయంలో కోత పెట్టిన భారత్!

  • గతేడాది అంచనాలకు మించి మాల్దీవులకు రూ.770 కోట్ల సాయం చేసిన భారత్ 
  • ఈసారి మధ్యంతర బడ్జెట్‌లో కేవలం రూ.600 కోట్ల కేటాయింపు
  • దౌత్య వివాదం నేపథ్యంలో భారత్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి 
గతేడాది మాల్దీవులకు అంచనాలకు మించి సాయం చేసిన భారత్ ఈ ఏడాది బడ్జెట్‌లో మాత్రం కోత పెట్టింది. దౌత్యవివాదం నేపథ్యంలో భారత్ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. గతేడాది భారత్ మాల్లీవులకు బడ్జెట్‌లో రూ.400 కోట్ల సాయం ప్రకటించింది. కానీ ఏడాది ముగిసే నాటికి అంచనాలకు మించి ఖర్చు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ విషయం వెల్లడైంది. 

బడ్జెట్‌లోని సవరించిన అంచనాల ప్రకారం, గతేడాది భారత్ 770 కోట్లు మాల్దీవులపై ఖర్చు పెట్టింది. అయితే, తాజా మధ్యంతర బడ్జెట్‌లో మాత్రం కేవలం రూ.600 కోట్లే కేటాయించింది. గతేడాది అంచనాల కంటే ఇది అధికంగానే ఉన్నా వాస్తవ ఖర్చు కంటే తక్కువగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇక దౌత్య వివాదం నేపథ్యంలో భారత్ ఈసారి కేటాయింపుల మేరకు సాయం అందిస్తుందా? తగ్గిస్తుందా? అన్నది వేచి చూడాలి. 

పొరుగు దేశాల విషయంలో భారత్ ఆభివృద్ధికారక సహకార విధానాన్ని అనుసరిస్తోంది. ఇందులో భాగంగా అవసరంలో ఉన్న దేశాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్, లైన్ ఆఫ్ క్రెడిట్ పద్ధతుల్లో ఆర్థిక సాయం చేస్తోంది. సామర్థ్యం పెంపు, సాంకేతిక సాయాన్ని కూడా అందిస్తోంది. వాణిజ్యం, సాంస్కృతిక రంగం మొదలు ఇంజినీరింగ్, ఇంధనం, ప్రజారోగ్యం, ఐటీ, మౌలిక వసతులు, స్పోర్ట్స్, సైన్స్ వంటి విభిన్న రంగాల్లో పొరుగు దేశాలకు సహాయసహకారాలు అందిస్తోంది. 

ఇక భారత్‌కు దీర్ఘకాలిక మిత్ర దేశంగా ఉన్న మాల్దీవులు గత కొంతకాలంగా చైనాకు దగ్గరవుతోంది. చైనా అనుకూల వాది ముహమ్మద్ ముయిజ్జు అధ్యక్ష పీఠం అధిరోహించాక ఈ మార్పు మరింత స్పష్టమైంది. ఈ నేపథ్యంలో లక్షద్వీప్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు మోదీ చేసిన ప్రయత్నంతో మాల్దీవుల మంత్రులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. విచక్షణ మరిచి ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. అయితే, భారత్‌ అనుకూల ప్రతిపక్షానికి ఇది అవకాశంగా మారడంతో అధ్యక్షుడు ముయిజ్జుపై విమర్శలు గుప్పించాయి. భారత్‌కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.


More Telugu News