అచ్చెన్నాయుడిపై చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలన్న ఏసీబీ.. గవర్నర్ అనుమతి తీసుకోమన్న కోర్టు!

  • ఈఎస్ఐ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై చార్జ్‌షీట్‌   
  • గవర్నర్ అనుమతి అక్కర్లేదన్న ఏసీబీ న్యాయవాదులు
  • సుప్రీంకోర్టు అలాంటి తీర్పు ఇచ్చి ఉంటే తమకు ఇవ్వాలని కోర్టు ఆదేశం
  • తదుపరి విచారణ 6కు వాయిదా
ఈఎస్ఐ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై దాఖలైన చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవడం కుదరదని విజయవాడ ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. దానిని పరిగణనలోకి తీసుకోవాలంటే అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) సెక్షన్ 19 ప్రకారం గవర్నర్ అనుమతి అవసరమని స్పష్టం చేసింది. స్పందించిన ఏసీబీ తరపు న్యాయవాదులు పీపీ దుష్యంత్‌రెడ్డి, ఆనంద్ జ్యోతి తమ వాదనలు వినిపిస్తూ  కేసు నమోదు చేసినప్పటి నుంచి విచారణ జరిగే వరకు ఎప్పుడైనా గవర్నర్ అనుమతి తీసుకోవచ్చని తెలిపారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు స్పందిస్తూ, సుప్రీంకోర్టు అలాంటి తీర్పు ఇచ్చి ఉంటే కోర్టుకు సమర్పించాలని కోరుతూ తదుపరి విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేశారు.

టెలిహెల్త్ సర్వీస్ (టీహెచ్ఎస్) ప్రైవేటు లిమిటెడ్‌కు పనులు అప్పగించాలంటూ ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ సీకే రమేశ్‌కుమార్‌పై అప్పటి కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చారంటూ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనను రెండో నిందితుడిగా పేర్కొంటూ 12 జూన్ 2020న అరెస్ట్ చేశారు. దర్యాప్తు అనంతరం చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ క్రమంలో దానిని పరిగణనలోకి తీసుకోవాలని ఏసీబీ కోరగా కోర్టు స్పందిస్తూ పీసీయాక్ట్ కింద నమోదైన కేసుల్లో ప్రజాప్రతినిధిపై దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను విచారణ కోసం పరిగణనలోకి తీసుకోవాలంటే ఆ చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం సంబంధిత అథారిటీ (అపాయింటింగ్ అథారిటీ) నుంచి అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది.


More Telugu News