తొలిసారి భయపడ్డా.. ప్రమాదం నాటి ఘటనను గుర్తు చేసుకున్న రిషభ్‌పంత్

  • 2022 డిసెంబరులో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్
  • డివైడర్‌ను ఢీకొని అగ్నికి ఆహుతైన కారు
  • స్థానికుల అప్రమత్తతతో క్షేమంగా బయటపడిన వికెట్ కీపర్
  • నరాలు దెబ్బతిని ఉంటే కాలును తొలగించాల్సి వచ్చేదని చెప్పడంతో భయపడ్డానని గుర్తు చేసుకున్న పంత్
  • పూర్తిగా స్థానభ్రంశం చెందిన కాలును తిరిగి యథాస్థితికి చేర్చారని వెల్లడి
ఘోర రోడ్డు ప్రమాదం బారినపడిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్‌పంత్ నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు. 26 ఏళ్ల పంత్ డిసెంబర్ 2022లో ఢిల్లీ నుంచి తన సొంత ఊరైన రూర్కీ వెళ్తూ ప్రమాదం బారినపడ్డాడు. అతడు ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు డివైడర్‌ను ఢీకొని మంటల్లో చిక్కుకుంది. స్థానికులు వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పంత్‌కు పలుమార్లు శస్త్రచికిత్సలు జరిగాయి. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న పంత్ జట్టులో తిరిగి చోటు కోసం ఎదురుచూస్తున్నాడు.

ఈ ప్రమాదంపై తాజాగా పంత్ పెదవి విప్పాడు. ‘స్టార్ స్పోర్ట్స్’తో మాట్లాడుతూ ప్రమాదంలో కుడికాలు స్థానభ్రంశం చెందిందని, తర్వాత దానిని యథాస్థానంలో ఉంచాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నాడు. నరాలు దెబ్బతినడం, ఇంకేదైనా తీవ్ర గాయమై ఉంటే కాలు తొలగించాల్సి వచ్చేదని చెప్పడంతో తొలిసారి తాను విపరీతంగా భయపడ్డానని గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో తన మనసును భయం ఆక్రమించిందని పేర్కొన్నాడు.

‘‘నా కుడికాలు తీవ్రంగా స్థానభ్రంశం చెందింది. దానిని మళ్లీ పూర్వస్థానంలో ఉంచాలని కోరాను. నరాలు దెబ్బతినడం లేదంటే అంతకంటే తీవ్ర గాయాలు అయి ఉంటే కనుక కాలును తొలగించాల్సి వచ్చేదని చెప్పడంతో నేను చాలా భయపడ్డాను. అంతకుముందు నేనేమీ భయపడలేదు. విపరీతమైన నొప్పిగా ఉండడంతో నా ఆలోచనంతా దానిపైనే ఉండేది’’ అని చెప్పుకొచ్చాడు.

నా కారు మళ్లీ పూర్వరూపానికి రాలేదు 
ప్రమాదం తర్వాత తన కారు స్థితి గురించి అప్పట్లో పంత్ తరచూ మాట్లాడేవాడు. ‘‘నేను నా కారును చూశాను. అది తన పూర్వరూపంలో లేదు. నా ఎస్‌యూవీ కాస్తా సెడాన్‌లా కనిపించింది’’ అని గుర్తు చేసుకుంటూ పెద్దగా నవ్వేశాడు.


More Telugu News