'శ్రీమంతుడు' స్టోరీ వివాదంపై చిత్రబృందం స్పందన

  • మహేశ్ బాబు-కొరటాల శివ కాంబోలో శ్రీమంతుడు చిత్రం
  • ఈ సినిమా కథ తనదేనంటూ కోర్టును ఆశ్రయించిన రచయిత శరత్ చంద్ర
  • మీడియా అప్పుడే ఓ అంచనాకు రావొద్దంటూ శ్రీమంతుడు టీమ్ విజ్ఞప్తి
  • ప్రస్తుతం న్యాయ పరిశీలన ప్రక్రియ జరుగుతోందని వెల్లడి
'శ్రీమంతుడు' సినిమా కథ తనదేనంటూ రచయిత శరత్ చంద్ర పేర్కొంటుండగా, ఈ విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లొచ్చింది. 

తాజాగా శరత్ చంద్ర ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను రాసిన 'చచ్చేంత ప్రేమ' నవలనే 'శ్రీమంతుడు' సినిమాగా తీశారని వెల్లడించారు. గతంలో ఈ సినిమా స్టోరీ వివాదంలో సినీ పెద్దలు రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారని తెలిపారు. రూ.15 లక్షలు ఇస్తామని అన్నారని శరత్ చంద్ర వివరించారు. 

ఈ నేపథ్యంలో, శ్రీమంతుడు టీమ్ స్పందించింది. "శ్రీమంతుడు, చచ్చేంత ప్రేమ... ఈ రెండు కథాంశాలు పరస్పరం పూర్తిగా విభిన్నం అని స్పష్టం చేసింది. శ్రీమంతుడు సినిమా, చచ్చేంత ప్రేమ నవలలు రెండు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పుస్తకం చదవండి, సినిమా చూడండి... వాస్తవం ఏంటో అర్థమవుతుంది. ఇక ఈ వ్యవహారం న్యాయ పరిశీలనలో ఉంది కాబట్టి, ఇప్పుడే ఒక అంచనాకు రావొద్దని మీడియాను కోరుతున్నాం. చట్టంపై మాకు నమ్మకం ఉంది. దయచేసి ఓపిక వహించండి" అంటూ ఓ ప్రకటనలో పేర్కొంది.


More Telugu News