శ్రీమంతుడు కథపై సినీ పెద్దలు రాజీ కుదర్చడానికి ప్రయత్నించారు: రచయిత శరత్ చంద్ర

  • 2015లో వచ్చిన శ్రీమంతుడు 
  • మహేశ్ బాబు-కొరటాల శివ కాంబోలో సినిమా
  • ఆ చిత్ర కథ తనదేనన్న రచయిత శరత్ చంద్ర 
  • అంగీకరించని కొరటాల శివ
  • సుప్రీంకోర్టులోనూ కొరటాలకు చుక్కెదురు
మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన శ్రీమంతుడు చిత్రం తన నవల ఆధారంగా తెరకెక్కించారంటూ రచయిత శరత్ చంద్ర న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. మహేశ్ బాబు-కొరటాల శివ కాంబోలో 2015లో శ్రీమంతుడు చిత్రం వచ్చింది. అయితే, ఆ చిత్ర కథ తనదే అంటూ రచయిత శరత్ చంద్ర తెరపైకి వచ్చారు. కానీ దర్శకుడు కొరటాల శివ అందుకు అంగీకరించలేదు. 

దాంతో శరత్ చంద్ర నాంపల్లి కోర్టును ఆశ్రయించగా, దర్శకుడు కొరటాల శివపై క్రిమినల్ చర్యలకు కోర్టు ఆదేశించింది. దాంతో కొరటాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా అక్కడా అదే ఫలితం ఎదురైంది. సుప్రీంకోర్టు గడప తొక్కినప్పటికీ కొరటాల శివ ఆశించిన ఫలితం దక్కలేదు. కింది కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు కొరటాల శివ క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సిందేనని సుప్రీం కోర్టు కూడా తేల్చి చెప్పింది. 

ఈ నేపథ్యంలో, రచయిత శరత్ చంద్ర ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. తాను రాసిన 'చచ్చేంత ప్రేమ' అనే నవల 2012లో స్వాతి మ్యాగజైన్ లో ప్రచురితమైందని తెలిపారు. ఆ నవలలోని కథాంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని సినిమా చేస్తే బాగుంటుందని తాను దర్శకుడు సముద్రను కలిశానని వివరించారు. 

తాము సినిమా ప్రారంభించాలనుకుంటున్న సమయంలోనే శ్రీమంతుడు రిలీజైందని, ఆ సినిమా చూసిన తన మిత్రులు... ఆ సినిమాలో కథ నీ నవలలో ఉన్నట్టే ఉంది అని చెప్పడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని శరత్ చంద్ర వెల్లడించారు. దాంతో, ఈ విషయాన్ని దర్శకుడు కొరటాల శివ దృష్టికి తీసుకెళ్లానని, మీరు తీసిన చిత్రంలోని కథ నాదే అని చెప్పినా ఆయన నుంచి సానుకూల స్పందన రాలేదని తెలిపారు. 

ఈ వ్యవహారం వివాదం రూపుదాల్చడంతో కొందరు సినీ పెద్దలు రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేశారని, తనకు రూ.15 లక్షలు ఇస్తామన్నారని శరత్ చంద్ర పేర్కొన్నారు. అయితే తాను న్యాయపోరాటానికే మొగ్గు చూపానని, ఈ వ్యవహారంలో రచయితల సంఘం అందించిన సాయాన్ని మర్చిపోలేనని వివరించారు. 

నాకు పరిహారం అవసరంలేదు... ఇప్పటికైనా ఈ కథ నాదేనని అంగీకరించమని కోరుతున్నా అని శరత్ చంద్ర స్పష్టం చేశారు.


More Telugu News