చంద్రబాబు, లోకేశ్ లపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టిన కేశినేని నాని

  • చంద్రబాబు పనికిమాలిన వ్యక్తి అన్న కేశినేని నాని
  • చంద్రబాబు ధనికుల పక్షపాతి.. జగన్ పేదల పక్షపాతి అని వ్యాఖ్య
  • దేవినేని అవినాశ్ 25 వేల ఓట్ల మెజర్టీతో గెలుపొందబోతున్నాడని జోస్యం
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ యువనేత నారా లోకేశ్ లపై వైసీపీ నేత, ఎంపీ కేశినేని నాని మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డ్వాక్రా రుణాలు, రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేసిన వ్యక్తి  చంద్రబాబు అని ఆయన విమర్శించారు. ధనికుల పక్షపాతి అయిన చంద్రబాబు పనికిమాలిన వ్యక్తి అని అన్నారు. ప్రజలకు ఏమీ చేయని చంద్రబాబు తన కొడుకు లోకేశ్ ని మంత్రిని చేశారని దుయ్యబట్టారు. లోకేశ్ కు ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. మీడియాను మేనేజ్ చేస్తూ వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పిన చంద్రబాబు కనీసం శంకుస్థాపన కూడా చేయలేదని కేశినేని నాని విమర్శించారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేసి చూపించిన గొప్ప నాయకుడు జగన్ అని కొనియాడారు. జగన్ పేదల పక్షపాతి అని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను అమ్ముకోవడమే లక్ష్యంగా చంద్రబాబు పని చేస్తున్నారని ఆరోపించారు. 

2014, 2019 ఎన్నికల్లో తాను ఉంటేనే గద్దె రామ్మోహన్ రావు ఎమ్మెల్యేగా గెలుపొందారని కేశినేని నాని అన్నారు. తాను లేకపోతే రామ్మోహన్ గెలిచేవారు కాదని, జీరో అయ్యేవారని చెప్పారు. ఈ ఎన్నికల్లో దేవినేని అవినాశ్ 25 వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాడని జోస్యం చెప్పారు. ఒక విజయవాడ నగరంలోనే జగన్ రూ. 325 కోట్ల రుణమాఫీ చేశారని ప్రశంసించారు. నాలుగో విడత వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో ఈరోజు నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News