ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో ఆరో స్థానానికి విరాట్ కోహ్లీ

  • టెస్టు ర్యాంకింగ్స్ విడుదల చేసిన ఐసీసీ
  • బ్యాటింగ్ ర్యాంకుల్లో ఒక స్థానం మెరుగుపర్చుకున్న కోహ్లీ
  • అగ్రస్థానంలో కేన్ విలియమ్సన్
  • బౌలింగ్ ర్యాంకుల్లో నెంబర్ వన్ గా అశ్విన్
  • ఆల్ రౌండర్ జాబితాలో తొలి రెండు స్థానాలు మనవాళ్లవే!
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్ విడుదల చేసింది. బ్యాటింగ్ ర్యాంకుల్లో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఒక స్థానం ఎగబాకి ఆరో ర్యాంకుకు చేరాడు. బ్యాటింగ్ ర్యాంకుల టాప్-10లో ఉన్న ఒకే ఒక్క భారత బ్యాట్స్ మన్ కోహ్లీనే. 

ఈ జాబితాలో న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో జో రూట్, మూడో స్థానంలో స్టీవ్ స్మిత్, నాలుగో స్థానంలో డారిల్ మిచెల్ (న్యూజిలాండ్), ఐదో స్థానంలో బాబర్ అజామ్ ఉన్నారు. ఇటీవల టీమిండియాతో తొలి టెస్టులో భారీ సెంచరీ సాధించిన ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ ఓల్లీ పోప్ ఒక్కసారిగా 20 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకుకు చేరుకున్నాడు.

బౌలింగ్ ర్యాంకుల్లో అశ్విన్ టాప్

ఐసీసీ విడుదల చేసిన టెస్టు బౌలింగ్ ర్యాంకుల్లో టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నెంబర్ వన్ స్థానాన్ని నిలుపుకున్నాడు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడా రెండో ర్యాంకు కైవసం చేసుకున్నాడు. బౌలింగ్ ర్యాంకుల టాప్-10లో మనవాళ్లు ముగ్గురున్నారు. జస్ప్రీత్ బుమ్రా 4, రవీంద్ర జడేజా 5వ స్థానంలో ఉన్నారు.

ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ మనదే, నెంబర్ టూ మనదే!

ఐసీసీ టెస్టు ఆల్ రౌండర్ల జాబితాలో తొలి రెండు స్థానాల్లో టీమిండియా ఆటగాళ్లు  కొనసాగుతున్నారు. నెంబర్ వన్ గా రవీంద్ర జడేజా, నెంబర్ టూగా రవిచంద్రన్ అశ్విన్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. అయితే, అక్షర్ పటేల్ ఒక స్థానం పతనమై ఆరో ర్యాంకులో నిలిచాడు. ఇటీవల కాలంలో తన స్పిన్ తో వికెట్లు పడగొడుతున్న ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్ మన్ జో రూట్ ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్ లో నాలుగో స్థానానికి ఎగబాకడం విశేషం.


More Telugu News