రెండుసార్లు డకౌట్ తర్వాత నా ఆలోచన మార్చింది ఆ ఒక్క పరుగే.. గుర్తు చేసుకున్న సచిన్ టెండూల్కర్

  • జీవితంలో తాను ఆడబోయే తొలి మ్యాచ్ చూసేందుకు కాలనీ స్నేహితులను ఆహ్వానించిన సచిన్
  • ఆ మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరగడంతో సాకులు
  • రెండో మ్యాచ్‌కూ స్నేహితులకు ఆహ్వానం
  • అప్పుడు కూడా మళ్లీ డకౌటే
  • మూడో మ్యాచ్‌కు స్నేహితులను ఆహ్వానించని సచిన్
  • ఆ మ్యాచ్‌లో ఒక్క పరుగు చేయడం చాలా సంతోషంగా అనిపించిందని గుర్తు చేసుకున్న క్రికెట్ దిగ్గజం
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన మొదటి మ్యాచ్‌కు సంబంధించిన సంగతులను గుర్తు చేసుకున్నాడు. జీవితంలో మొదటి మ్యాచ్ ఆడబోతున్న సచిన్ తానుండే సాహిత్య సహవాస్ కాలనీలోని వారిని మ్యాచ్ చూసేందుకు ఆహ్వానించాడు. అయితే, ఆ మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. కాలనీ ప్రధాన బ్యాటర్‌ని అయిన తనను ఇది తీవ్రంగా నిరాశపరిచిందని సచిన్ చెప్పుకొచ్చాడు. ‘‘అలా అవుటైనందుకు గల్లీ క్రికెట్‌లో చెప్పే సాకులు చెప్పా. బంతి తక్కువ ఎత్తులో వచ్చిందని చెప్పడంతో వారు కూడా అవునన్నారు’’ అని పేర్కొన్నాడు.

రెండో మ్యాచ్‌కు కూడా సచిన్ మళ్లీ తన స్నేహితులను ఆహ్వానించాడు. అయితే, ఆ మ్యాచ్‌లోనూ మొదట మ్యాచ్‌కు భిన్నంగా ఏమీ జరగలేదు. ఆ మ్యాచ్‌లో సచిన్ తొలి బంతికే డకౌట్ అయ్యాడు. అప్పుడు కూడా మళ్లీ అవే సాకులు చెప్పుకొచ్చాడు. ‘‘ఈసారి బంతి కొంత ఎత్తులో వచ్చింది. అది నా తప్పుకాదు పిచ్ ప్రాబ్లం’’ అని చెప్పడంతో ఈసారి కూడా వారు అంగీకరించారు. 

రెండుమ్యాచుల్లో వరుసగా ఫెయిలైన సచిన్ మూడో మ్యాచ్‌కు స్నేహితుల ముందు పరువు పోకూడదని ఎవరినీ పిలవలేదు. ఈ మ్యాచ్‌లోనైనా తనను అదృష్టం వరించాలని కోరుకున్నాడు. ఆ మ్యాచ్‌లో ఐదారు బంతులు ఆడిన సచిన్ ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. ‘‘ఒక్క పరుగే చేసినప్పటికీ ఎందుకో చాలా సంతోషంగా అనిపించింది. శివాజీ పార్క్ నుంచి బాంద్రాకు బస్సులో వెళ్తున్నప్పుడు సంతృప్తిగా అనిపించింది. ఒక్క పరుగు విలువ ఏంటో ఆ తర్వాత అందరూ చెప్పేవారు. గెలుపోటములను నిర్ణయించేది ఆ ఒక్క పరుగేనని చెప్పడంతో నా ఆలోచనా విధానాన్ని అది మార్చింది’’ అని చెప్పుకొచ్చాడు. బుధవారం గల్లీ క్రికెట్ ఆడుతూ ఈ విషయాలను సచిన్ గుర్తు చేసుకున్నాడు.


More Telugu News