హెచ్1బీ వీసా రిజిస్ట్రేషన్ల మోసాలను అరికట్టేందుకు అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం

  • అమెరికా వచ్చే వృత్తి నిపుణులకు ప్రత్యేకంగా హెచ్1బీ వీసాలు
  • లాటరీ పద్దతిలో వీసాల కేటాయింపు
  • దాంతో ఒక్కొక్కరు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేస్తున్న వైనం
  • ఇకపై ఎన్ని దరఖాస్తులు చేసినా ఒకే అప్లికేషన్ గా పరిగణింపు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వృత్తి నిపుణులకు అమెరికా స్వర్గధామం అనడంలో అతిశయోక్తి లేదు. అనేక టెక్ కంపెనీలకు, దిగ్గజ సంస్థలకు పుట్టినిల్లయిన అమెరికాలో అత్యధిక వేతనాలు, ప్యాకేజీలు లభిస్తుండడంతో వివిధ రంగాల నిపుణులు అగ్రరాజ్యం బాటపడుతుంటారు. 

ఇలా పెద్ద సంఖ్యలో వలస వచ్చే వృత్తి నిపుణుల కోసం అమెరికా ప్రత్యేకంగా హెచ్1బీ వీసాలు మంజూరు చేస్తుంటుంది. డిమాండ్ ను తట్టుకోవడం కోసం లాటరీ పద్ధతిలో హెచ్1బీ వీసాలు కేటాయిస్తుంటుంది. దాంతో ఒక్కొక్కరు పెద్ద సంఖ్యలో వీసా రిజిస్ట్రేషన్ దరఖాస్తులు చేసుకుంటుండడం అమెరికాను పునరాలోచనలో పడేసింది. 

ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులు చేసుకున్నా, వాటిని ఒక అప్లికేషన్ గానే భావిస్తారు. "ఒక వ్యక్తి-ఒక దరఖాస్తు"... "దరఖాస్తుదారులందరికీ సమాన అవకాశాలు" అనే భావన కలిగించేలా ఈ నిబంధన తీసుకువచ్చినట్టు అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్ సీఐఎస్) విభాగం వెల్లడించింది. 

అంతేకాదు, ఇకపై ప్రతి దరఖాస్తుదారు తన పాస్ పోర్టు, ప్రయాణ వివరాలకు సంబంధించి వాస్తవాలనే దరఖాస్తులో పేర్కొనాల్సి ఉంటుంది. తప్పుడు సమాచారం అని తేలితే ఆ దరఖాస్తును తిరస్కరిస్తారు. 2025 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని యూఎస్ సీఐఎస్ తెలిపింది.


More Telugu News